పవన్ దూకుడుతో చంద్రబాబు పరేషాన్

విశాఖ గర్జన సమయంలో రసాభస సృష్టించిన పవన్, జనసేన కార్యకర్తలు.. ఆ తర్వాత వచ్చిన ఏ ఛాన్స్‌ను వదలడం లేదు. పవన్ దూకుడును తగ్గిద్దామని స్వయంగా చంద్రబాబు ఆయనను కలిసి మాట్లాడారు.

Advertisement
Update:2022-11-14 12:46 IST

ఏపీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడుకు కొత్త చిక్కు వచ్చి పడింది. కోరి తెచ్చుకున్న పవన్ కల్యాణ్ దూకుడుతో పరేషాన్ అవుతున్నారు. తనకు అక్కరకు వస్తారని భావిస్తే, తననే డామినేట్ చేసే రాజకీయాలు చేస్తుండటంతో తల పట్టుకుంటున్నారు. అసలు ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబా లేదంటే పవన్ కల్యాణా అని ప్రజలే కామెంట్లు చేస్తున్నారు. మోడీతో భేటీలో పవన్ ఆశించిన మేరకు హామీలు ఏమీ లభించలేదు. దీంతో తనదైన శైలిలోనే వైసీపీ ప్రభుత్వంపై దూకుడు పెంచారు. మోడీతో భేటీ విఫలమైందని పైకి తెలియనీయకుండా పవన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

విశాఖ గర్జన సమయంలో రసాభస సృష్టించిన పవన్, జనసేన కార్యకర్తలు.. ఆ తర్వాత వచ్చిన ఏ ఛాన్స్‌ను వదలడం లేదు. పవన్ దూకుడును తగ్గిద్దామని స్వయంగా చంద్రబాబు ఆయనను కలిసి మాట్లాడారు. టీడీపీ, జనసేన కలిసి పోరాటాలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే పవన్‌ను చంద్రబాబు కలిసినట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ, పవన్ మాత్రం ఇప్పట్లో చంద్రబాబు మాట వినే పరిస్థితి కనిపించడం లేదు.

ఇప్పటం వెళ్లి నానా హడావిడి చేసిన పవన్ కల్యాణ్.. తాజాగా జగనన్న కాలనీలు సందర్శించి అక్కడ భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు మొదలు పెట్టారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు చేయాల్సిన పనులన్నీ పవన్ చేసేస్తుండటంతో ఏం చేయాలో పాలు పోవడం లేదు. పవన్ దూకుడు ఇలాగే కొనసాగితే జనవరి 27 నుంచి లోకేశ్ తలపెట్టిన పాదయాత్రకు కూడా మైలేజీ రాదని మదనపడుతున్నారు. ఈ లోగా పవన్ దూకుడును తగ్గించాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఒక వర్గం ఓట్లు టీడీపీకి పడాలంటే పవన్ తమ వెంట వస్తేనే సాధ్యం అవుతుంది. అంతే కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా చీలకుండా ఉంటుంది. అయితే, టీడీపీతో పొత్తంటే ఎలా ఉంటుందో పవన్‌కు కూడా బాగా తెలుసు. నామమాత్రంగా ఏ పదో పదిహేనో సీట్లు ఇచ్చి చంద్రబాబు చేతులు దులిపేసుకుంటాడని పవన్ అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు దూకుడుగా ఉంటేనే కనీసం 40 నుంచి 50 సీట్లను డిమాండ్ చేసి మరీ తీసుకోవచ్చని భావిస్తున్నారు.

పవన్ కావాలనే దూకుడు మీద వెళ్తున్నట్లు చంద్రబాబు గ్రహించారు. అతడిని వారించి కూర్చోబెట్టలేరు. అదే చేస్తే మొత్తానికే చేజారిపోయే అవకాశం ఉన్నది. అందుకే సరైన సమయం కోసం చంద్రబాబు వేచి చూస్తున్నట్లు తెలుస్తున్నది. అంతే కాకుండా బీజేపీతో జత కట్టాలంటే పవన్ కల్యాణే మధ్యవర్తిగా వ్యవహరిస్తారనే ఆశలు కూడా పెట్టుకున్నారు. ఈ కారణాలతోనే ప్రస్తుతం దూకుడుగా వ్యవహరిస్తున్నా.. చంద్రబాబు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. కానీ లోకేశ్ పాదయాత్ర ప్రారంభమయ్యేలోపు పవన్ దూకుడికి అడ్డుకట్ట వేసేలా చంద్రబాబు ఏదో ఒక స్కెచ్ వేస్తారనే చర్చ జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News