తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే -పవన్
కావాలంటే ఆ మాటలన్న నాయకులను తిట్టాలి కానీ, మధ్యలో తెలంగాణ ప్రజలు ఏం చేశారని వైసీపీ నేతలపై మండిపడ్డారు పవన్ కల్యాణ్. తెలంగాణ ప్రజానీకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ మంత్రి హరీష్ రావు వర్సెస్ ఏపీ మంత్రుల ఎపిసోడ్ లో కాస్త ఆలస్యంగా రియాక్ట్ అయ్యారు పవన్ కల్యాణ్. దాదాపుగా ఆ ఎపిసోడ్ ని అందరూ మరచిపోతున్నారనుకున్న సమయంలో పవన్ స్పందించారు. తెలంగాణ ప్రజలకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజానీకాన్ని కించపరిచేలా వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారాయన. సీఎం జగన్ వారిని నిలువరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇస్లాం విద్యాసంస్థలకు విరాళాలు ఇచ్చేందుకు మైనార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు పవన్ కల్యాణ్. ఆ సమావేశం తర్వాత ఏపీ-తెలంగాణ మధ్య జరిగిన మటాల యుద్ధంపై ప్రత్యేకంగా స్పందించారు. హరీష్ రావు ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేసినా.. దానికి వైసీపీ నేతలు స్పందించిన తీరు సరికాదన్నారు. కావాలంటే ఆ మాటలన్న నాయకులను తిట్టాలి కానీ, మధ్యలో తెలంగాణ ప్రజలు ఏం చేశారని వైసీపీ నేతలపై మండిపడ్డారు పవన్ కల్యాణ్. తెలంగాణ ప్రజానీకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నాయకులు వేరు, ప్రజలు వేరు అని చెప్పారు పవన్. నాయకులు అన్న మాటలకు ప్రజల్ని ఎలా బాధ్యులు చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు హైదరాబాద్ లో ఇళ్లు, వ్యాపారాలు లేవా అని అడిగారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయకూడదని జనసేన ముందు నుంచీ చెబుతోందని గుర్తుచేశారు. వైసీపీ నేతల తీరుని తాము ఖండిస్తున్నామన్నారు. వైసీపీ పెద్దలు కూడా వారిని వారించాలని సూచించారు.