బ్రహ్మచారిగా ఉండాలనుకున్నా.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. - పవన్ కళ్యాణ్

Unstoppable with NBK – Pawan Kalyan: జీవితంలో పెళ్లి చేసుకోకూడదని అనుకున్నా. బ్రహ్మచారిగా ఉండి యోగ మార్గంలో వెళ్లాలనుకున్నా. అలాంటిది నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానా.. అని ఒక్కోసారి నాకే ఆశ్చర్యం కలుగుతుంది.

Advertisement
Update:2023-02-03 15:16 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తరచూ వచ్చే విమర్శ ఆయన మూడు పెళ్లిళ్లపైనే. ఆయన ఎవరిని ఉద్దేశించి విమర్శించినా ప్రత్యర్థి పార్టీ నేతలు మాత్రం పవన్ మూడు పెళ్లిళ్లను వేలెత్తి చూపుతూ విమర్శిస్తుంటారు. అయితే మూడు పెళ్లిళ్లపై వస్తున్న విమర్శలపై.. నాకు రాసి లేదు.. అలా జరిగింది.. ఏం చేయను..అంటూ పవన్ కళ్యాణ్ పలుసార్లు సమాధానం ఇచ్చారు. ఆహా ఓటీటీలో ప్రసారం అయ్యే అన్ స్టాపబుల్ షో వేదికగా ఇప్పుడు మరోసారి మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు.

అన్ స్టాపబుల్ సీజన్ -2 చివరి ఎపిసోడ్ లో హోస్ట్ నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ కు పలు ఆసక్తికర ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అలాగే మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందని కూడా బాలయ్య ప్రశ్నించారు.

దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తూ ' జీవితంలో పెళ్లి చేసుకోకూడదని అనుకున్నా. బ్రహ్మచారిగా ఉండి యోగ మార్గంలో వెళ్లాలనుకున్నా. అలాంటిది నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానా.. అని ఒక్కోసారి నాకే ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఏది ప్లాన్ చేసి చేసుకోలేదు. అలా జరిగిపోయింది.

మొదటిసారి ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు. చేసుకున్నా.. తమ బంధంలో కొన్ని కుదరలేదు విడిపోవలసి వచ్చింది. రెండోసారి రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నా. ఆమెతో కూడా కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆమెతో కూడా విడిపోవలసి వచ్చింది.

నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నా చట్టబద్ధంగా ఒకరికి విడాకులు ఇచ్చి మరొకరిని పెళ్లి చేసుకున్నా. కొందరు ప్రతిసారి నా మూడు పెళ్లిళ్లపైనే విమర్శలు చేస్తున్నారు. నేనేమీ ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకోలేదు. ముగ్గురితో ఒకేసారి ఉండలేదు. ముగ్గురిని ఒకే గదిలో పెట్టలేదు.

ఒకరితో రిలేషన్ షిప్ లో కొన్ని కుదరలేదు.. అందుకే విడిపోవలసి వచ్చింది. మరొకరిని చేసుకున్నా ఆమెతోనూ అభిప్రాయ బేధాలు వచ్చాయి. చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నప్పటికీ నా మూడు పెళ్లిళ్లు చాలామందికి ఆయుధంగా మారింది. నాకు మాత్రం మూడు పెళ్లిళ్లు చేసుకున్నాననే గిల్ట్ మాత్రం లేదు' అని పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై సమాధానం ఇచ్చారు.

అన్ స్టాపబుల్ షోకు పవన్ కళ్యాణ్ వస్తున్నారని వార్తలు ప్రారంభమైన్నప్పటి నుంచి.. మరో వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అదేంటంటే.. షోకు గెస్ట్ గా వస్తే మూడు పెళ్లిళ్ల గురించి ప్రశ్న వేయకూడదని పవన్ ఆహా వారికి ఒక కండిషన్ పెట్టినట్లు.. అయితే ఈ వార్తలు నిజం కాలేదు. పవన్ మూడు పెళ్లిళ్లపై బాలయ్య సూటిగానే ప్రశ్నించగా.. పవన్ కళ్యాణ్ కూడా మూడు పెళ్లిళ్లు ఏ పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చిందో సమాధానం ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News