ఇది రూపాయి పావలా ప్రభుత్వం

జగన్ ఏపీకి భవిష్యత్తు కాదని, ఆయన రాష్ట్రానికి వచ్చిన విపత్తు అని మండిపడ్డారు పవన్. 38 కేసులున్న జగన్‌ రాజకీయాలకు అనర్హుడని చెప్పారు.

Advertisement
Update:2023-10-05 07:27 IST

అనుకున్నట్టుగానే పెడన సభలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు పవన్ కల్యాణ్. పెడనలో తనపై రాళ్లదాడి జరుగుతుందని ఆరోపణలు చేసిన పవన్.. సభలో ప్రభుత్వంపై విమర్శలదాడి చేశారు. జగన్ ది రూపాయి పావలా ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. తన చిన్నప్పుడు రూపాయి పావలాకు బొమ్మ ఇస్తామంటూ కొంతమంది రోడ్లపైకి వచ్చేవారు, దగ్గరకు వెళ్తే రేటు పెంచేసేవారని.. ఏపీలో కూడా అలాగే నవరత్నాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు.


పవన్ ఆరోపణలు..

- ఇళ్ల నిర్మాణానికి రూ.43 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి రూ.8,258 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

- ఉపాధి హామీ పథకంలో దేశంలోనే అత్యంత అవినీతి జరిగిన రాష్ట్రం ఏపీ.

- 6 లక్షల ఉద్యోగాలిచ్చామంటూ అబద్ధాలు.. వాలంటీర్ పోస్ట్ లు, ఆర్టీసీ క్రమబద్ధీకరణ కూడా కొత్త ఉద్యోగాలేనా..?

- ప్రభుత్వాన్ని నిలదీసినందుకు సెక్షన్‌ 124 కింద ఏపీలో అత్యధిక కేసులు.

- ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్ముకుంటున్నారు.

తన సినిమా విడుదలయితే టికెట్‌ ధరలు తగ్గిస్తారని, తన పుట్టినరోజున ప్లాస్టిక్‌ నిషేధం పేరుతో ఫ్లెక్సీలు కట్టకుండా అడ్డుకుంటారని.. అవన్నీ రూపాయి పావలా చేష్టలేనని అన్నారు పవన్. జగన్‌ కు దమ్ముంటే కేంద్రం దగ్గరకు వెళ్లి ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, స్టీల్‌ ప్లాంట్‌ గురించి అడగాలని.. కానీ ఆయనకు పావలా దమ్ము కూడా లేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో సోనియాగాంధీకి కనిపించకుండా దాక్కుని ప్లకార్డులు ప్రదర్శించిన ఘనత జగన్ ది అని ఎద్దేవా చేశారు.

జగన్ ఏపీకి భవిష్యత్తు కాదని, ఆయన రాష్ట్రానికి వచ్చిన విపత్తు అని మండిపడ్డారు పవన్. 38 కేసులున్న జగన్‌ రాజకీయాలకు అనర్హుడని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు చూస్తున్న చీకటి రోజులు మళ్లీ రాకూడదంటే జనసేన-టీడీపీ ప్రభుత్వం రావాలన్నారు. పెడన సభకు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కూడా తరలి వచ్చాయి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు కూడా పెడనలో పవన్ సభకు హాజరవడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News