ఎవరు రాజో.. ఎవరు మంత్రో.. అవన్నీ రిజల్ట్ వచ్చాక
సీఎం అవుతానో లేదో అనేది తర్వాతి విషయం అని, ముందు ఎన్నికల్లో గెలవడమే తక్షణ కర్తవ్యం అని అన్నారు పవన్ కల్యాణ్. సీఎం కావడం అనేది మనకు వచ్చే మెజార్టీ స్థానాలపై ఆధారపడి ఉంటుందన్నారు.
మనలో మనం గొడవలు పెట్టుకోకుండా ఉంటే.. మనమే గెలుస్తామంటూ జనసైనికులకు హితబోధ చేశారు పవన్ కల్యాణ్. మచిలీపట్నంలో కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడిన పవన్.. టీడీపీతో గొడవలు పెట్టుకోవద్దని చెప్పారు. పాతగొడవలు మరచిపోయి కలసి పనిచేద్దామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాటల ద్వారానే సమస్యలకు పరిష్కారం వెతుకుదామన్నారు జనసేనాని.
సీఎం అవుతానో లేదో అనేది తర్వాతి విషయం అని, ముందు ఎన్నికల్లో గెలవడమే తక్షణ కర్తవ్యం అని అన్నారు పవన్ కల్యాణ్. సీఎం కావడం అనేది మనకు వచ్చే మెజార్టీ స్థానాలపై ఆధారపడి ఉంటుందన్నారు. అదే సమయంలో టీడీపీని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని, అది నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ అని, ఎవరి ఓటు షేరు వారికి ఉంటుందని చెప్పారు. అధికారం సాధించే దశలో జనసేన బలమైన స్థానంలో ఉండాలనేది తన ఆకాంక్ష అని అన్నారు పవన్.
పార్టీ పెట్టగానే అధికారంలోకి రాలేం కదా..
పార్టీ పెట్టగానే అధికారంలోకి రావడం ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యమైందని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. నాలుగు ఎన్నికల్లో కష్టపడితే బీఎస్పీ అధికారంలోకి వచ్చిందన్నారు. లేచిందే లేడికి పరుగు అన్నట్లు.. పార్టీ పెట్టగానే అధికారం రాదని చెప్పారు. జనసేన విశాలభావం ఉన్న పార్టీ అని, ఇది ప్రాంతీయ పార్టీ కాదని, రాబోయే రోజుల్లో జనసేన భావజాలమే దేశమంతా వ్యాపిస్తుందని చెప్పారు.
ఏ ఒక్క కులం సపోర్ట్ తోనో పార్టీలు అధికారంలోకి రావనే విషయాన్ని జనసైనికులు గుర్తుంచుకోవాలన్నారు పవన్ కల్యాణ్. తాను అన్నింటినీ సమదృష్టితో చూసే వ్యక్తిని అన్నారు. కులాలను వెదుక్కొని స్నేహాలు చేయనన్నారు. వైసీపీలో కీలక పదవులన్నీ ఒక వర్గంతో నింపేశారని, అలా చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారని, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు పవన్ కల్యాణ్.