ఎనిమిదేళ్ల తర్వాత కలిశాం.. ఏమేం మాట్లాడుకున్నామంటే..?
ఆయన చాలా విషయాలు అడిగారని, తనకు అవగాహన ఉన్నంత వరకు అన్నీ చెప్పానన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన మీటింగ్ ఇదని అన్నారు పవన్.
కొండంత రాగం తీసి చివరకు ఏదో చేసినట్టుంది పవన్ కల్యాణ్ పరిస్థితి. నిన్నటి నుంచి పవన్ కల్యాణ్ – ప్రధాని నరేంద్ర మోదీ భేటీపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ నడిచింది. పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత మోదీతో భేటీ అవుతున్నారు, వారిద్దరూ ఏం మాట్లాడుకుంటారో, ఏపీ రాజకీయాల్లో ఏమైనా సంచలన ప్రకటనలు ఉంటాయా, కూటముల విషయంలో క్లారిటీ వస్తుందా అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ చివరకు పవన్ మీటింగ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో ఏమీ చెప్పకుండానే తేల్చేశారు. జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నలు సావధానంగా విని కూడా.. అవన్నీ తర్వాత తెలియజేస్తానంటూ వడివడిగా వెళ్లిపోయారు.
విశాఖ పర్యటనలో భాగంగా పవన్-మోదీ భేటీ తీవ్ర ఆసక్తిని కలిగించినా, చివరకు ఆ భేటీలో ఏమీ లేదని పవన్ మాటలతో స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత మళ్లీ ఎనిమిదేళ్లకు ప్రధానితో సమావేశమయ్యానని చెప్పారు పవన్ కల్యాణ్. రెండు రోజుల క్రితం పీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, అందుకే తాను విశాఖ వచ్చానని చెప్పారు. ఆయన చాలా విషయాలు అడిగారని, తనకు అవగాహన ఉన్నంత వరకు అన్నీ చెప్పానన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన మీటింగ్ ఇదని అన్నారు.
మంచి రోజులొస్తాయి..
మీటింగ్ వెనక ముఖ్య ఉద్దేశం అంటూ ఏదో చెప్పాలని మొదలు పెట్టినా.. చివరకు తెలుగు ప్రజలు బాగుండాలి, ఏపీ బాగుండాలి. ఏపీ అభివృద్ధి చెందాలంటూ మోదీ ఆకాంక్షించినట్టు తెలిపారు పవన్ కల్యాణ్. భవిష్యత్తులో మంచిరోజులు వస్తాయని నమ్ముతున్నట్టు తెలిపారు. క్లుప్తంగా మీటింగ్ సారాంశం వివరించి వెనుదిరిగి వెళ్లిపోయారు. పవన్ వ్యాఖ్యలనుబట్టి చూస్తుంటే.. మోదీ కేవలం కుశల ప్రశ్నలతోనే సరిపెట్టారని, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యవహారాలేవీ వారిమధ్య చర్చకు రాలేదని తేలిపోయింది.