పార్టీ టికెట్ కోసం ప్రజాసేవకు దిగిన ఎన్ఆర్ఐలు
నియోజకవర్గాలకి దూరంగా ఉన్న టీడీపీ సీనియర్ నేతలు.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తమ నియోజకవర్గాలకు చేరుతున్నారు. ఇలా వస్తున్న నేతలకి అక్కడ వినిపిస్తున్న ఎన్ఆర్ఐల పేర్లు చికాకు తెప్పిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీలో సీనియర్లకి కొత్త చిక్కు వచ్చి పడింది. చాలా నియోజకవర్గాలలో తమ సీట్ల కిందకి ఎన్ఆర్ఐల రూపంలో నీళ్లు వచ్చాయని తెలిసేసరికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. నాలుగేళ్లుగా కేసుల భయంతో, పార్టీ కార్యక్రమాలకు ఖర్చులు పెట్టాల్సి వస్తుందన్న ముందు జాగ్రత్తతో నియోజకవర్గాలకి దూరంగా ఉన్న టీడీపీ సీనియర్ నేతలు.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తమ నియోజకవర్గాలకు చేరుతున్నారు. ఇలా వస్తున్న నేతలకి అక్కడ వినిపిస్తున్న ఎన్ఆర్ఐల పేర్లు చికాకు తెప్పిస్తున్నాయి. దశాబ్దాలుగా ఉంటున్న తమని కాదని, నిన్నా మొన్న వచ్చిన ఎన్ఆర్ఐలకి పార్టీలో ప్రాధాన్యం దక్కడంపై గుర్రుగా ఉన్నారు.
పాత నేతలు ఎవరూ ఎన్ఆర్ఐల దూకుడుపై నోరు విప్పడంలేదు. తొలిసారిగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియా ఎదుటే అక్కసు వెళ్లగక్కారు. ఎన్నికలకి ముందే ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే ఎన్ఆర్ఐ నేతలది హడావుడేనంటూ ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఇప్పుడు ఖర్చు పెట్టి హడావుడి చేస్తారు.. ఆ తర్వాత చేతులెత్తేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి టికెట్లు ఇస్తే ఎలా అంటూ అధిష్టానాన్ని నిలదీశారు. ఇటీవలే టీడీపీ మహానాడులో భారీ విరాళం ప్రకటించిన భాష్యం ప్రవీణ్ అనే ఎన్ఆర్ఐపై అక్కసుతోనే ప్రత్తిపాటి పుల్లారావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ఆర్ఐ భాష్యం ప్రవీణ్ టికెట్ రేసులోకి వచ్చాడని తెలిసే పుల్లారావు అజ్ఞాతం వీడి టీడీపీ స్రవంతిలో కలిశారనే ప్రచారం ఉంది.
గుడివాడ నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము ఫౌండేషన్ కూడా ఆ నియోజకవర్గ పరిధిలో కార్యక్రమాలు చేపడుతోంది. ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావుకి కూడా సీటు కేటాయింపు అనుమానంగా మారింది. మాడుగుల నియోజకవర్గంలో పైలా ప్రసాద్ అనే ఎన్ఆర్ఐ 2019లో టికెట్ ట్రై చేశాడు.. దక్కలేదు. మళ్లీ ఇప్పుడు భారీ విరాళాలు, సేవాకార్యక్రమాలు చేపట్టాడు. అధిష్టానం ఎన్ఆర్ఐల వైపు మొగ్గు చూపితే ఇక్కడ గవిరెడ్డి రామానాయుడుకి సీటు ఇవ్వకపోవచ్చు.
గుంటూరులో జనవరి 1న చంద్రన్న కానుక పేరుతో ఎన్టీఆర్ జనతా వస్త్రాల పంపిణీని ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత ఉయ్యూరు శ్రీనివాస్ చేపట్టారు. ఇక్కడ తొక్కిసలాట జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం చోటుచేసుకోకుండా ఉంటే, ఉయ్యూరు శ్రీనివాస్ అనే ఎన్ఆర్ఐ గుంటూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించేవారు. పొన్నూరు నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ శ్రీనివాస్ తొక్కిసలాట ఘటనతో కాస్తా వెనక్కితగ్గారు. గుంటూరు జిల్లాకి చెందిన మన్నవ మోహన్ కృష్ణ కూడా ఎన్ఆర్ఐ. ఇటీవలకాలంలో టీడీపీ కార్యక్రమాలన్నింటిలోనూ చాలా చురుకుగా పాల్గొంటున్నారు. విరాళాలు, ఫౌండేషన్ సేవలు కూడా కొనసాగిస్తున్నారంటే ఎవరో ఒకరి సీటు మీద కన్నేసినట్టే అని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు టీడీపీలో ఎన్ఆర్ఐల సేవలు అంటే సీనియర్లు ఉలిక్కిపడుతున్నారు. ఈ రోజు సేవ రేపటి టీడీపీ టికెట్‌కి పోటీ అని భయపడుతున్నారు.