పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి.. నెల్లూరులో పొలిటికల్ హీట్

అరెస్ట్ లతో తాను అదిరేది, బెదిరేది లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. తన అనుచరులను అరెస్ట్ చేసి తనను బెదిరించాలని చూస్తే కుదరదన్నారు.

Advertisement
Update:2023-02-17 21:27 IST

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నెల్లూరులో పెరిగిన పొలిటికల్ హీట్ ఇంకా చల్లారలేదు. ప్రతిరోజూ ప్రెస్ మీట్లతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి తాజాగా మైనార్టీలతో నిరసన మీటింగ్ పెట్టి మరింత హడావిడి చేశారు. అయితే సాయంత్రానికల్లా ఆయన ప్రధాన అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నాలుగు నెలల క్రితం జరిగిన ఓ సంఘటన వ్యవహారంలో రూరల్ ఎమ్మెల్యే అనుచరుడు తాటి వెంకటేశ్వర్లుని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అరెస్ట్ విషయం తెలిసిన ఎమ్మెల్యే హుటాహుటిన పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.

అయితే పోలీసులు మాత్రం ఆయన్ను ఏ స్టేషన్ లో ఉంచారనే విషయాన్ని చెప్పలేదు. దీంతో కాసేపు నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లోనే కూర్చున్నారు ఎమ్మెల్యే. ఆయన రాకతో అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. చివరకు 24గంటల్లో కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో కోటంరెడ్డి వెనుదిరిగారు.

అదిరేది లేదు, బెదిరేది లేదు..

అరెస్ట్ లతో తాను అదిరేది, బెదిరేది లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. తన అనుచరులను అరెస్ట్ చేసి తనను బెదిరించాలని చూస్తే కుదరదన్నారు. అన్నిటికీ సిద్ధపడినవారే తన వెంట ఉన్నారని చెప్పారు. 4నెలల క్రితం జరిగిన ఘటనలో ఇప్పుడు అరెస్ట్ చేయడం వెనక ఉన్న ఉద్దేశమేమిటో తమకు తెలుసన్నారాయన. అరెస్ట్ ల విషయంలో ఇలాగే దూకుడుగా వెళ్తే, న్యాయపోరాటానికి సైతం సిద్ధమన్నారు ఎమ్మల్యే కోటంరెడ్డి.

తాడోపేడో..

అటు అధిష్టానం కూడా కోటంరెడ్డితో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది. నెల్లూరు నగర మేయర్ సహా కొంతమంది కార్పొరేటర్లు ఇంకా కోటంరెడ్డితోనే ఉన్నారు. దీంతో వారిని కూడా తమవైపు తిప్పుకోవాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుగుబాటు కార్పొరేటర్ల స్థానంలో డివిజన్ కి ఇన్ చార్జ్ లను పెడతామని హెచ్చరించారు, అభివృద్ధికి సహకరిస్తానని మరోవైపు బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా కోటంరెడ్డి అనుచరుడి అరెస్ట్ సంచలనంగా మారింది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే అధిష్టానాన్ని ధిక్కరించి పార్టీనుంచి బయటకొచ్చేసిన కోటంరెడ్డి ముందు ముందు మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు.

Tags:    
Advertisement

Similar News