దాగుడు మూతల దండాకోర్.. టీడీపీ కొత్త నిరసన
మొత్తానికి నారా లోకేష్.. 50డేస్ స్పెషాలిటీ చూపించారని అందరూ గుసగులలాడుకుంటున్నారు. జైలులో చంద్రబాబుతో లోకేష్ ములాఖత్ తర్వాత ఈ ప్రకటన బయటకు రావడంతో ఇది చంద్రబాబు ఐడియానా, లేక లోకేష్ ఐడియానా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల కాలంలో చిత్ర విచిత్రమైన నిరసనల పేరుతో టీడీపీ ఏపీ రాజకీయాల్లో మంచి కామెడీ పంచుతోంది. తాజాగా ఈ లిస్ట్ లో మరో వెరైటీ నిరసన చేరింది. ఆ నిరసనకు లోకేష్ పెట్టిన పేరు 'కళ్లు తెరిపిద్దాం'. సీఎం జగన్ కు కళ్లు తెరిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలని పిలుపునిచ్చారు లోకేష్. దీనికోసం ప్రజలంతా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలపాలన్నారు. ఈ ఆదివారం రాత్రి 7 గంటలనుంచి 7 గంటల 5 నిమిషాల మధ్యలో కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా "నిజం గెలవాలి" అంటూ గట్టిగా నినాదాలు చేయాలన్నారు లోకేష్. అలా నినాదాలు చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలని పిలుపునిచ్చారు.
గంటలు కొట్టడం, హారన్లు మోగించడం, క్యాండిళ్లు వెలిగించడం, పళ్లాలపై గరిటెలతో కొట్టడం.. ఇలాంటి చిత్రవిచిత్రమైన నిరసనలు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఇప్పటి వరకూ మనం చూశాం. ఇటీవల దసరాకు 'సైకో పోవాలి' అనే నినాదాన్ని రాసిన పేపర్లను దహనం చేశారు కూడా. చేతులకు సంకెళ్లు వేసుకుని చేపట్టిన నిరసన కూడా మంచి వినోదాన్ని పంచింది. ఆ పేరుతో కొంతమంది సెల్ ఫోన్ చార్జింగ్ వైర్లు, ఇంకొకరు కుక్కలకు వేసే గొలుసులు కట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చి నవ్వులపాలయ్యారు. ఈ నిరసనల నెక్స్ట్ లెవల్.. కళ్లకు గంతలు కట్టుకోవడం.
దీపావళి స్పెషల్ ఏంటి..?
దసరాకే ధమాకా చూపించారు లోకేష్, ఇప్పుడు కళ్లకు గంతలు కట్టుకుని గట్టిగా అరవాలంటూ మరో విచిత్రమైన పిలుపునిచ్చారు. చూడబోతే దీపావళికి లోకేష్ కి వచ్చే విచిత్రమైన ఐడియా ఏంటా అని టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని టపాకాయలు కాల్చమంటారేమోనని వణికిపోతున్నారు. మొత్తానికి నారా లోకేష్.. 50డేస్ స్పెషాలిటీ చూపించారని అందరూ గుసగులలాడుకుంటున్నారు. జైలులో చంద్రబాబుతో లోకేష్ ములాఖత్ తర్వాత ఈ ప్రకటన బయటకు రావడంతో ఇది చంద్రబాబు ఐడియానా, లేక లోకేష్ ఐడియానా అనేది చర్చనీయాంశంగా మారింది.