ఈ ఎంపీకి ఇంకా జ్ఞానోదయం కాలేదా?
తమిళనాడుకు ముఖ్యమంత్రిగా చేసిన జయలలిత అక్రమాస్తుల కేసుల విచారణను కర్నాటకలో విచారణ జరిపినట్లే జగన్ కేసుల విచారణను కూడా మరో రాష్ట్రంలో విచారణ జరపాలని ఎంపీ తన పిటీషన్‌లో కోరారు.
జగన్మోహన్ రెడ్డి కేసులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి కోర్టులో పిటీషన్ వేశారు. గతంలో కూడా చాలాసార్లు చాలా కేసులు వేశారు. కొన్ని కేసులను కొట్టేసిన కోర్టులు మరికొన్ని కేసుల్లో గట్టిగా బుద్ధిచెప్పి డిస్మిస్ చేశాయి. అయినా రఘురాజు బుద్ధి మారలేదు. కుక్కతోక వంకర అన్నట్లుగా జగన్‌పైన తనకున్న కసిని మరోమారు పిటీషన్ రూపంలో బయటపెట్టుకున్నారు. ఇంతకీ రెబల్ ఎంపీ పిటీషన్ ఏమిటంటే జగన్ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీచేయాలట.
జగన్ మీద నమోదైన 11 కేసుల్లో ఒక్కటి కూడా ఇంతవరకు విచారణ పూర్తిచేసుకోలేదట. అన్నీ కేసులు కలిపి ఇప్పటివరకు 3041 సార్లు వాయిదాపడ్డాయట. విచారణ జరిపి వెంటనే నిందితులపై చర్యలు తీసుకునే ఉద్దేశం సీబీఐలో కనబడటంలేదని ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడైన జగన్‌కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చినట్లు ఎంపీ ఆరోపించారు. దీనివల్ల జగన్ కేసుల విచారణలో అంతులేకుండా పోతోందని బాధపడిపోయారు.
జగన్ కేసుల విచారణను గమనించిన తర్వాత జనాలకు అనుమానాలు పెరిగిపోతున్నాయట. తమిళనాడుకు ముఖ్యమంత్రిగా చేసిన జయలలిత అక్రమాస్తుల కేసుల విచారణను కర్నాటకలో విచారణ జరిపినట్లే జగన్ కేసుల విచారణను కూడా మరో రాష్ట్రంలో విచారణ జరపాలని ఎంపీ తన పిటీషన్‌లో కోరారు. ఎలాంటి కారణాలు లేకుండానే జగన్ విచారణకు గైర్హాజరవుతున్నట్లు ఎంపీ ఆరోపించటమే విచిత్రంగా ఉంది. ఒకవైపు విచారణ జరగటంలేదని ఆరోపించిందీ ఎంపీనే మరోవైపు విచారణకు గైర్హాజరవుతున్నట్లు ఆరోపించిందీ ఎంపీనే. విచారణకు వ్యక్తిగత హాజరు నుండి జగన్ కోర్టు అనుమతి తీసుకున్న విషయాన్ని ఎంపీ తట్టుకోలేకపోతున్నట్లున్నారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జగన్‌తో చెడిన దగ్గర నుండి ఎంపీ అనేక పిటీషన్లు వేశారు. వాటిల్లో చాలావాటిని కోర్టులు కొట్టేశాయి. మరికొన్ని పిటీసన్లపై ఎంపీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. జగన్‌కు సంబంధించిన కేసుల్లో ఎంపీ బాధితుడు కాదు, నిందితుడు కదా, కనీసం సాక్షి కూడా కాదు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కోర్టు ఎంపీకి బాగా తలంటి కేసులను కొట్టేసిన విషయం తెలిసిందే. జగన్ కేసులతో ఏ సంబంధంలేకపోయినా ఎందుకు పిటీషన్లు వేస్తున్నారంటు మండిపడింది. అయినా ఎంపీకి బుద్ధి వచ్చినట్లు లేదు. మరీసారి కోర్టు ఏమంటుందో చూడాలి.