హాయ్ AP.. బైబై BP(బాబు, పవన్) ..
వారాహి యాత్రలో పవన్ ఇచ్చిన స్లోగన్లకు మంత్రి రోజా కౌంటర్లిచ్చారు. బైబై వైసీపీ అంటూ పవన్ చెప్పిన మాటల్ని ప్రజలు పట్టించుకోరని, బదులుగా వారు బైబై బీపీ అంటూ చంద్రబాబు, పవన్ ఇద్దరినీ తరిమేస్తారని అన్నారు.
హలో AP.. బైబై YCP అంటూ ఇటీవల పవన్ కల్యాణ్ వారాహిపై నిలబడి హుషారుగా చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి.
అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి..
అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి..
జనం బాగుండాలంటే జగన్ పోవాలి..
హలో ఏపీ.. బైబై వైసీపీ... అంటూ జనసైనికుల్ని ఉత్సాహపరుస్తూ ప్రసంగించారు పవన్ కల్యాణ్. ఆయన స్లోగన్లకు అప్పుడే కౌంటర్లు రెడీ అయిపోయాయి. అవి కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. పనిలో పనిగా పవన్ తో పాటు చంద్రబాబుకి కూడా కౌంటర్ స్లోగన్లతో ఒకేసారి బదులిచ్చారు మంత్రి రోజా. హాయ్ AP.. బైబై BP అనే కొత్త స్లోగన్ ని ఆమె తెరపైకి తెచ్చారు. ఇక్కడ BP అంటే బాబు, పవన్ అని అర్థం చెప్పారు రోజా.
జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా అవగాహన శిబిరంలో పాల్గొన్న మంత్రి రోజా.. పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. వారాహి యాత్రలో పవన్ ఇచ్చిన స్లోగన్లకు ఆమె కౌంటర్లిచ్చారు. బైబై వైసీపీ అంటూ పవన్ చెప్పిన మాటల్ని ప్రజలు పట్టించుకోరని, బదులుగా వారు బైబై బీపీ అంటూ చంద్రబాబు, పవన్ ఇద్దరినీ తరిమేస్తారని అన్నారు.
అసలు పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు లేదని, జిల్లా అధ్యక్షులు లేరని, 175 స్థానాల్లో నిలబడటానికి అభ్యర్థులు కూడా లేరన్నారు. అయినా సీఎం జగన్ ని తరిమేస్తానని పవన్ కల్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుని నమ్మే పరిస్థితుల్లో ఏపీ ప్రజలు లేరని, స్లోగన్స్ దగ్గర్నుంచి మేనిఫెస్టో వరకు వారిదంతా కాపీయేనని సెటైర్లు వేశారు. బుర్ర పెట్టి కొత్తగా ఆలోచించే సత్తా కూడా వారికి లేదని ఎద్దేవా చేశారు. చెప్పిన ప్రతి మాటను నెరవేర్చిన సీఎం జగన్ ను కాదని, ఏపీ ప్రజలు మళ్లీ చంద్రబాబుని కొనితెచ్చుకుంటారా అని ప్రశ్నించారు రోజా.