బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్‌లోకి టీడీపీని ఎలా తీసుకెళ్లాలనేదే పవన్ లక్ష్యం : మంత్రి అమర్‌నాథ్

బీజేపీ ఏ రోడ్ మ్యాప్ ఇచ్చినా మాకు ఎందుకు సంబంధం. అది టీడీపీని దగ్గర చేర్చడానికి పవన్ చేస్తున్న ప్రయత్నమే అని మంత్రి చెప్పారు.

Advertisement
Update:2022-11-11 14:04 IST

ప్రధాని మోడీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీకి అంత ప్రాముఖ్యత ఏమీ లేదని ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. మోడీ వైజాగ్ పర్యటన పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పారు. టీడీపీ-బీజేపీని కలిపేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని అమర్‌నాథ్ ఆరోపించారు. ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలకు సీట్లు, ఓట్లు లేవని అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్‌లోకి టీడీపీని తీసుకెళ్లాలని పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారని.. అందుకే భేటీ కోసం అంత ఆత్రంగా ఉన్నారని అన్నారు.

ప్రధాని మోడీ వైజాగ్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి అమర్‌నాథ్.. ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. పవన్-మోడీ భేటీ పూర్తిగా రాజకీయమైనదని స్పష్టం చేశారు. మోడీ దేశానికి ప్రధాని అయినా.. ఆయన బీజేపీలో అగ్రనాయకుడు. అందుకే ఆ రెండు పార్టీల కార్యక్రమంపై కామెంట్ చేయడం అవసరం లేదన్నారు. బీజేపీ ఏ రోడ్ మ్యాప్ ఇచ్చినా మాకు ఎందుకు సంబంధం. అది టీడీపీని దగ్గర చేర్చడానికి పవన్ చేస్తున్న ప్రయత్నమే అని చెప్పారు.

జనసేన పార్టీకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నా.. దాని శాశ్వత అనుబంధం మాత్రం తెలుగుదేశంతోనే అని మంత్రి చెప్పారు. పవన్ కల్యాణ్‌ తెలుగుదేశాన్ని తప్ప మిగతా అన్ని పార్టీలను స్టెపినీలుగానే చూస్తాడని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీలు, స్క్రిప్ట్ కోసం ఎలా పని చేయాలో అనే విషయంపైనే పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారని మంత్రి ఆరోపించారు. రిషికొండపై వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అక్కడ ప్రభుత్వ శాఖకు చెందిన పనులు జరుగుతున్నాయి. దాన్ని ఎందుకు ఇంత సీరియస్‌గా చిత్రీకరిస్తున్నారో అర్థం కాలేదని అమర్‌నాథ్ అన్నారు. చంద్రబాబు నాయుడు కావాలనే దాన్ని పెద్ద తప్పుగా సీన్ క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు.

ఇటీవల విశాఖ గర్జన సందర్భంగా పవన్ కల్యాణ్, ఆయన కార్యకర్తలు చేసిన రచ్చను చూశాం. మంత్రులపై దాడి చేయడమే కాకుండా.. వారిని చంపుతామని బెదిరింపులకు దిగారు. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించి దాన్నో రాజకీయ అంశంగా మార్చాలని ప్రయత్నం చేశారు. కానీ, అక్కడ జరిగిన వాస్తవం ఏమిటో ప్రజలందరికీ తెలుసని మంత్రి చెప్పారు. ఇకనైనా పవన్ కల్యాణ్ సొంత నిర్ణయాలు, సొంత అజెండాతో ప్రజల్లోకి వెళ్లాలి.. ఇంకా చంద్రబాబు తొత్తుగా వ్యవహరించడం మానుకోవాలని మంత్రి అమర్‌నాథ్ హితవు పలికారు.

Tags:    
Advertisement

Similar News