మాచర్లలో రిగ్గింగ్.. బయటపడుతున్న టీడీపీ అకృత్యాలు
మొత్తం ఫుటేజి బయటపెట్టకుండా, కేవలం పిన్నెల్లి చర్యల్నే కావాలని బయటకు తెచ్చారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. మొత్తం ఫుటేజ్ బయటపెడితే టీడీపీ రిగ్గింగ్ వ్యవహారం అందరికీ తెలుస్తుందని చెప్పారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విలన్ గా చూపించే ప్రయత్నాల్లో టీడీపీ, ఎల్లో మీడియా తలమునకలై ఉంది. ఈ విషయంలో టీడీపీ గురివింద గింజలా మారింది. ఇప్పుడు టీడీపీ తప్పులు కూడా ఒక్కొక్కటే బయటకొస్తున్నాయి. మాచర్లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ కి ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు చేసింది టీడీపీ నేతలేననే విషయం బయటపడింది.
వైసీపీ మద్దతుదారుల్ని ఓటు వేయనీయకుండా టీడీపీ నేతలు, పోలింగ్ బూత్ లో ఉన్న ఏజెంట్లు అడ్డుకుంటున్న వీడియో.. కాస్త ఆలస్యంగా బయటకొచ్చింది. రెంటచింతల మండలం పాల్వాయి గేటులోని 201, 202 పోలింగ్ బూత్‌లో టీడీపీ రిగ్గింగ్ చేసినట్టు స్పష్టమవుతోంది. టీడీపీ బరితెగించినా ఎన్నికల అధికారులు మాత్రం అక్కడ చోద్యం చూశారు. టీడీపీ నేతల రిగ్గింగ్ పై పోలీసులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోకపోవడం విశేషం. సాక్షాత్తూ ఎమ్మెల్యే పిన్నెల్లి ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదు.
ఈవీఎం పగలగొట్టింది అందుకే..
టీడీపీ రిగ్గింగ్ ఆపేందుకు బూత్ లోపలికి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి.. వారిని నిలువరించేందుకే ఈవీఎం పగలగొట్టారని అంటున్నారు. దీనికి సంబంధించిన మొత్తం ఫుటేజి బయటపెట్టకుండా, కేవలం పిన్నెల్లి చర్యల్నే కావాలని బయటకు తెచ్చారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. మొత్తం ఫుటేజ్ బయటపెడితే టీడీపీ రిగ్గింగ్ వ్యవహారం అందరికీ తెలుస్తుందన్నారు.