రెబెల్ ఎమ్మెల్యేగానే కోటంరెడ్డి.. టీడీపీలో చేరిక ఇప్పట్లో లేనట్లే!

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరడంపై స్థానిక నాయకత్వం కాస్త వ్యతిరేకత చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement
Update:2023-03-16 13:32 IST

ఏపీలో అధికార వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పట్లో పార్టీని వీడే అవకాశం లేనట్లు తెలుస్తున్నది. ఇప్పటికే టీడీపీకి దగ్గరైన ఆయన.. తాజాగా అసెంబ్లీలో కూడా వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. నేడు రేపో ఆయన పసుపు కండువా కప్పుకోవడం గ్యారెంటీ అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలలోని ఇద్దరు అధికార వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడటం దాదాపు ఖరారు అయ్యింది. అయితే వీరిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మీదే టీడీపీ ముందుగా ఫోకస్ చేస్తోంది.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరడంపై స్థానిక నాయకత్వం కాస్త వ్యతిరేకత చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అధినేత చంద్రబాబు మాత్రం కోటంరెడ్డి ఫ్యామిలీ టీడీపీలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తున్నది. కానీ కోటంరెడ్డిని ఇప్పటికిప్పుడే పార్టీలోకి రావొద్దని.. కొంత కాలం వైసీపీలోనే రెబెల్ ఎమ్మెల్యేగా కొనసాగాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తున్నది. కోటంరెడ్డి కంటే ముందుగా ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.

ఈ నెల 24న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరడానికి మార్గం సుగమం అయినట్లు తెలుస్తున్నది. వాస్తవానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుగానే టీడీపీలోకి వెళ్లడానికి డిసైడ్ అయి.. వైసీపీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఆ సమయంలో ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డికి రూరల్ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం భావించింది. కానీ గిరిధర్ రెడ్డి కూడా సోదరుడు శ్రీధర్ రెడ్డితోనే కలిసి నడవాలని డిసైడ్ చేసుకున్నారు. దీంతో పార్టీ అతడికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీతో ఎలాంటి అటాచ్‌మెంట్లు లేకపోవడంతో గిరిధర్ రెడ్డి తొలుత టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తున్నది.

ఇక శ్రీధర్ రెడ్డి మాత్రం ఇప్పట్లో టీడీపీలో చేరకపోయినా.. ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించే అవకాశం ఉన్నది. ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. అందులో తాను ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తానని శ్రీధర్ రెడ్డి చెప్పారు. అంటే ఆయన వైసీపీ అభ్యర్థికి ఓటు వేసే అవకాశం లేదు. ఇద్దరు రెబెల్ వైసీపీ ఎమ్మెల్యేలు తమ అభ్యర్థికి ఓటు వేస్తారని చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. అలా అయినా సరే.. గెలిచేందుకు అవసరమైన ఓట్లు లభించే అవకాశం లేదు. ఒక వేళ విప్ ధిక్కరించి శ్రీధర్ రెడ్డి టీడీపీకి ఓటు వేస్తే అతడిపై వేటు పడే అవకాశం ఉంటుంది.

మొత్తానికి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటు పార్టీని వీడక.. అటు టీడీపీలో చేరకుండా అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారనున్నారు. ఇప్పుడు అతడిపై వేటు వేసి ఉపఎన్నికకు వెళ్లే ఆలోచన కూడా వైసీపీలో లేదు. కాబట్టి కొన్నాళ్లు అతడిని అలా వదిలేసే అవకాశం ఉన్నట్లు వైసీపీలో చర్చ జరుగుతోంది. 

Tags:    
Advertisement

Similar News