టీడీపీ కంటే జనసేన హడావిడి ఎక్కువ..
కూటమి అధికారంలోకి రాకపోయినా పర్లేదు, పవన్ గెలిస్తే చాలు అనుకుంటున్నారు. ఆ బ్యాచ్ అంతా పిఠాపురం రిజల్ట్ కోసమే వెయిటింగ్. ఆ రిజల్ట్ వచ్చాక వారి ఆవేశం చల్లారిపోతుందా..? లేక కంటిన్యూ అవుతుందా..? వేచి చూడాలి.
ఏపీలో కూటమి వ్యవహారం విచిత్రంగా తోస్తుంది. 175 స్థానాలకు గాను 144 చోట్ల పోటీ చేస్తున్న టీడీపీ కంటే కేవలం 21 సీట్లలో పోటీ చేస్తున్న జనసేన హడావిడి ఎక్కువగా ఉంది. కౌంటింగ్ రోజు ఈ సందడి మామూలుగా లేదు. జనసేనకు సోషల్ మీడియా సైన్యం ఎక్కువ. ఆ సందడి అంతా ఈరోజు సోషల్ మీడియాలో కనపడుతోంది. ఉదయాన్నే జనసైనికులు సోషల్ మీడియా పోస్టింగ్ లతో సిద్ధమైపోయారు. పిఠాపురం అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండింగ్ లోకి తెచ్చేశారు.
కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో టీడీపీ హవా ఎక్కువ. ఒకవేళ టీడీపీకి సొంతగా మెజార్టీ వస్తే జనసేనని పట్టించుకోరనే సంగతి వేరే చెప్పక్కర్లేదు. కానీ జనసైనికులకు అవన్నీ అవసరం లేదు. పిఠాపురంలో పవన్ గెలుస్తున్నారా లేదా, ఆయన అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది మాత్రమే వారికి కావాల్సింది. అందుకోసమే ఈసారి జనసైనికులంతా కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఉదయాన్నే ట్వీట్లతో హడావిడి మొదలు పెట్టారు.
టీడీపీతో పోల్చి చూస్తే జనసేన సోషల్ మీడియా పోస్టింగ్ లు రెట్టింపుకంటే ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఈ హడావిడి జరిగేదే అయినా.. ఈసారి మాత్రం పిఠాపురం విజయంపై జనసైనికులు ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ ని తొలిసారి ఎమ్మెల్యేగా చూసుకోవాలని వారంతా ఆతృతగా ఉన్నారు. అసలు కూటమి అధికారంలోకి రాకపోయినా పర్లేదు, పవన్ గెలిస్తే చాలు అనుకుంటున్నారు. ఆ బ్యాచ్ అంతా పిఠాపురం రిజల్ట్ కోసమే వెయిటింగ్. ఆ రిజల్ట్ వచ్చాక వారి ఆవేశం చల్లారిపోతుందా..? లేక కంటిన్యూ అవుతుందా..? వేచి చూడాలి.