వైసీపీ ఎందుకు ఓడిపోయిందంటే..? అసలు కారణం చెప్పిన జగన్

నెల్లూరు జిల్లా జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన జగన్.. ఆయనపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.

Advertisement
Update:2024-07-04 14:33 IST

వైసీపీ ఓటమికి ఈవీఎంలు కారణం అంటూ గతంలో ఆరోపించిన జగన్.. ఇప్పుడు మరో రీజన్ బయటపెట్టారు. చంద్రబాబు మోసపు హామీల వల్ల కేవలం 10శాతం ఓట్లతోనే కూటమి గెలిచిందని అన్నారు. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత వల్లే వైసీపీ ఓడిపోయిందనడం సరికాదన్నారు. 10శాతం మంది ప్రజలు చంద్రబాబు మోసపు హామీలు నమ్మడం వల్ల ఏపీలో అధికార మార్పిడి జరిగిందన్నారు జగన్.

నెల్లూరు జిల్లా జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన జగన్.. ఆయనపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. కారంపూడి సీఐపై పిన్నెల్లి హత్యాయత్నం చేసినట్టు కేసు పెట్టారని, అది తప్పుడు కేసు అని అన్నారు. మే 14న ఆ ఘటన జరిగిందని అంటున్నారని, మరి మే 23 వరకు కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నిజంగానే దాడి జరిగితే వెంటనే కేసు పెట్టేవారని, కానీ మే 23 వరకు ఆగి తప్పుడు కేసు పెట్టారని విమర్శించారు. వైసీపీ నేతల్ని, కార్యకర్తల్ని టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు జగన్.


టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో సామాన్య ప్రజల్ని కూడా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు జగన్. శిశుపాలుని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కచ్చితంగా వారికి బుద్ధి చెబుతారని అన్నారు జగన్. తమ హయాంలో కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరికీ సంక్షేమం అందిందని చెప్పారాయన. కానీ నేడు అమ్మఒడి లేదని, రైతు భరోసా ఇవ్వట్లేదని, పథకాలన్నీ ఆలస్యమవుతున్నాయని, అసలు నిధులు విడుదల చేస్తారో లేదో తెలియదని చెప్పారు జగన్. ప్రజలు ఇంకా తమవైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. జైలులో ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లిని కలసి ధైర్యం చెప్పారు జగన్. 

Tags:    
Advertisement

Similar News