అవినాష్ రెడ్డి అరెస్ట్ ఈసారి ఖాయమేనా..?

ఇప్పుడు అరెస్ట్‌కు ఎలాంటి ఆటంకాలు కూడా లేకపోవడంతో అవినాష్‌ రెడ్డి మంగళవారం విచారణకు వచ్చిన సమయంలో అరెస్ట్ చేయవచ్చన్న ప్రచారమూ జరుగుతోంది.

Advertisement
Update:2023-05-15 18:26 IST

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న సీబీఐ మళ్లీ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో స్పష్టం చేసింది దర్యాప్తు సంస్థ. పులివెందుల్లోని అవినాష్ రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లి ఈ నోటీసులను అందజేశారు.

ఇప్పటికే అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి కోర్టులను విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఆ తరహా ఊరట లభించలేదు. అయినప్పటికీ కొద్దిరోజులుగా సీబీఐ ఎలాంటి అలికిడి చేయకుండా మౌనంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు అవినాష్‌రెడ్డికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈసారి ఆయన అరెస్ట్ ఖాయమన్న ప్రచారమూ నడుస్తోంది. ఇది వరకు న్యాయస్థానాల్లోనూ సీబీఐ పరోక్షంగా ఈ విషయాన్ని చెప్పింది. హత్యలో అవినాష్ పాత్ర ఉందని.. ఆయన్ను అరెస్ట్‌ చేసి విచారించాలనుకుంటున్నామని కోర్టులకు చెప్పింది. హత్యకు ముందు, తర్వాత నిందితులు అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని సీబీఐ ఆరోపిస్తోంది.

ఇప్పుడు అరెస్ట్‌కు ఎలాంటి ఆటంకాలు కూడా లేకపోవడంతో అవినాష్‌ రెడ్డి మంగళవారం విచారణకు వచ్చిన సమయంలో అరెస్ట్ చేయవచ్చన్న ప్రచారమూ జరుగుతోంది. ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది.

అటు ఇదే కేసులో అరెస్ట్‌ అయిన ఉదయ్‌ కుమార్‌ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. బెయిల్ ఇవ్వాలని ఉదయ్ కుమార్ రెడ్డి పిటిషన్‌ వేయగా.. సీబీఐ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దర్యాప్తు కీలక దశలో ఉందని.. నిందితుడికి బెయిల్ ఇస్తే దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని సీబీఐ వాదించింది. వివేకా హత్య గురించి బయటి ప్రపంచానికి తెలియకముందే ఉదయ్‌ కుమార్ రెడ్డికి స్పష్టమైన సమాచారం ఉందని.. కాబట్టి అసలైన కుట్రదారుల గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి తెలుసని సీబీఐ కోర్టుకు వివరించింది. సీబీఐ వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags:    
Advertisement

Similar News