చంద్రబాబు హయాంలో మత్తులో ఊగిన ఏపీ.. ఇప్పుడు సగానికి సగం..
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం బెల్ట్ షాపులను, వైన్స్‌ల వద్ద పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుబంధంగా 43 వేల బెల్ట్ షాపులు ఉండేవి.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ మద్యం మత్తులో ఊగిపోయింది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మద్య విక్రయాలు చాలా వరకు తగ్గాయి. దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. జగన్ ప్రభుత్వం చేపట్టిన మద్యం నియంత్రణ విధానం వల్ల గ్రామాల్లో సానుకూల వాతావరణం ఏర్పడింది. అక్కాచెల్లెమ్మల కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు అధికారికంగా విక్రయాలు జరిపేవి. అనధికార విక్రయాల గురించి చెప్పాల్సిన పనిలేదు. జగన్ ప్రభుత్వం మద్యం విక్రయాల సమయాన్ని కుదించింది. ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉంటున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం బెల్ట్ షాపులను, వైన్స్‌ల వద్ద పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుబంధంగా 43 వేల బెల్ట్ షాపులు ఉండేవి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడగానే వాటిని రద్దు చేశారు. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా అనుమతి పొందిన పర్మిట్ రూమ్‌లు అనధికారికమైన బార్లుగా పనిచేసేవి. వాటిని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది.
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని మద్యం దుకాణాలను సగానికి సగం తగ్గించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,380 మద్యం దుకాణాలుండగా, వాటిని 2,934కు తగ్గించారు. బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారు చేసిన 840 బార్లు మాత్రమే ఉన్నాయి. కొత్తగా పర్మీషన్లేమీ ఇవ్వలేదు.
మద్యం విక్రయాలను నిరుత్సాహపరచడమే తమ పార్టీ విధానమని జగన్ పలుమార్లు చెప్పారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం రాగానే మద్యం రేట్లను పెంచారు. అదనపు ఎక్సైజ్ టాక్స్ (ఏఆర్‌ఈటీ) విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. ఏఆర్‌ఈటీ పన్నుతో ప్రభుత్వానికి రాబడి పెరిగినట్లు పైకి కనిపిస్తుంది. కానీ మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి.
ధరల పెంపు వల్ల చాలా మంది పేదలు మద్యం మానేశారు. కేంద్ర సర్వే ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించింది. రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం 2015-16లో రాష్ట్రంలోని పురుషుల్లో 34.9 శాతం, మహిళల్లో 0.4 శాతం మద్యం సేవించేవారు. 2019-21 నాటికి రాష్ట్రంలో మద్యం సేవించే పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గారు. మద్యం నియంత్రణ వల్లనే ఇది సాధ్యమైంది.