రేషన్ బియ్యం అక్రమ రవాణా.. టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఫైర్
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ మండిపడ్డారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి నేడు కాకినాడ పోర్టును తనిఖీ చేశారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని తాము ఎన్నికల ప్రచారం సమయంలోనే చెప్పామని, తాము చెప్పినట్టుగా ఇక్కడ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం ఇవాళ్టి పరిశీలనలో నిజమని తేలిందని పవన్ వెల్లడించారు. వేల టన్నుల బియ్యం పట్టుకోవడం జరిగిందని తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాకినాడ పోర్టు పరిశీలనకు వచ్చే సయయంలోనే, జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
ఎంతో కీలకమైన తనిఖీ సందర్భంగా ఎస్పీ ఎందుకు ఇక్కడ లేరని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇక్కడి ఉచిత బియ్యాన్ని విదేశాలకు తరలించి కిలోకు రూ.75లకు అమ్ముకుని వేలాది కోట్లు సంపాదించుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారులు పట్టుకున్న బియ్యం నౌకను సీజ్ చేసి , పోర్ట్ అధికారులకు నోటీసులు ఇవ్వని సంబంధిత అధికారులను ఆదేశించారు. రేషన్ బియ్యం అక్రమాలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని హెచ్చరించారు. పోర్టు అధికారుల పేర్లు నమోదు చేయాలని ఆదేశించారు. పోర్ట్ ఆఫీసర్ ధర్మ శాస్త్ర, డీఎస్పీ రఘు వీర్, సివిల్ సప్లై డీఎస్ఓ ప్రసాద్‌పై మండిపడ్డారు. ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.