ఏపీ ఎన్నికల్లో పోటెత్తిన అక్రమ మద్యం.. పట్టుబడింది నామమాత్రం
ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల దగ్గర పట్టుకున్న మద్యం విలువ రూ.58.70 కోట్లు. కానీ వాస్తవంగా చెక్‌పోస్టులు దాటేసిన మద్యం అంతకు పదింతలు ఎక్కువే ఉంటుందని అంచనా.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి అధికార, విపక్షాలు విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లిన సంగతి తెలిసిందే. ఓటేయడానికి డబ్బులివ్వడం అధికార పార్టీతో సహా విపక్ష అభ్యర్థులూ చేశారు. కానీ విపక్షాలు తమ పార్టీ సభలకు, కార్యక్రమాలకు రావడానికి యువతను ఆకర్షించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని విచ్చలవిడిగా తెప్పించి, పంచిపెట్టాయి. ముఖ్యంగా జనసేన, టీడీపీ అభ్యర్థుల్లో చాలామంది నేరుగా గోవా, ఒరిస్సా, మహారాష్ట్రల్లో డిస్టిలరీలతో మాట్లాడుకుని చౌక రకం మద్యాన్ని తెచ్చి విచ్చలవిడిగా ఓటర్లకు పంచేశారని సమాచారం. ఏపీ పోలీసులు, సెబ్ అధికారులు ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల దగ్గర పట్టుకున్న మద్యం విలువ రూ.58.70 కోట్లు. కానీ వాస్తవంగా చెక్‌పోస్టులు దాటేసిన మద్యం అంతకు పదింతలు ఎక్కువే ఉంటుందని అంచనా.
ప్రభుత్వ మద్యం విధానంతో కటకట
గతంలో ఎన్నికల ముందే అభ్యర్థులు కొన్ని మద్యం దుకాణాలతో నేరుగా బేరం మాట్లాడుకుని చీప్ లిక్కర్ కొనేసేవారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీని మార్చి అమ్మకాలను ప్రభుత్వ ఆధీనంలోకి తేవడంతో ప్రతిపక్షాలకు మింగుడుపడలేదు. మందు లేకపోతే ఎవర్నీ సభలకు రప్పించలేమని తెలుసు. ఓట్ల సంబరం మొదలయినప్పటి నుంచి ఓటింగ్ పూర్తయ్యే వరకు కార్యకర్తలను మందులో ముంచెత్తాల్సిందే. దీంతో జనసేన, టీడీపీ అభ్యర్థులు, కొందరు వైసీపీ అభ్యర్థులు కూడా పొరుగు రాష్ట్రాల నుంచి లారీల కొద్దీ చౌకైన, నాణ్యతలేని మందు తెప్పించారు.
అక్రమంగా మద్యం తరలిస్తున్న 61,543 మంది అరెస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్), కమర్షియల్ ట్యాక్స్, రవాణా శాఖలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 150 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర సరిహద్దుల నుంచి ఏపీలోకి వచ్చేచోట, జిల్లాల సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో వాహనాలను తనిఖీ చేయగా రూ.58.7 కోట్ల విలువైన మద్యం పట్టుబడింది. ఈ అక్రమ మద్యంతో సంబంధం ఉన్న 61,543 మందిని సెబ్ అధికారులు అరెస్ట్ చేశారు.
కోడ్‌కు ముందే తెప్పించి, డంప్‌లు పెట్టేశారు
టికెట్ పక్కా అనుకున్న చాలామంది నేతలు ముందే గోవా, మహారాష్ట్రల్లో డిస్టిలరీలతో మాట్లాడుకుని లారీల కొద్దీ సరకు తెప్పించుకుని నిల్వ చేసేసుకున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో క్వార్టర్ బాటిల్ కనీస ధర రూ.150 పైమాటే. అదే గోవాలోని డిస్టిలరీల్లో చౌక రకం మద్యం క్వార్టర్ రూ.50, 55లకే దొరుకుతుంది. వాటిని పెద్ద పెద్ద బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేసి మరీ తెప్పించుకున్నారు.
చేరవేతకు రూ.10 లక్షల ఛార్జీ
గోవా, మహారాష్ట్రల నుంచి సరకు తెచ్చి, సురక్షితంగా అప్పగించే బాధ్యతను కొంతమంది తీసుకున్నారు. గోవా నుంచి రెండు రాష్ట్రాలు దాటి ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాలకు చేరవేసినందుకు లారీకి రూ.10 లక్షలు ఛార్జి చేశారు. ఎన్నికల కోడ్ దగ్గరపడే కొద్దీ ఈ రేటు పెరుగుతూ వచ్చింది. లారీకి రూ.20 లక్షలు తీసుకుని కోడ్ వచ్చాక కూడా మద్యం చేరవేశామని చెబుతుండటం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.