రాజకీయాల నుంచి తప్పుకుంటున్న!
ఇక వ్యవసాయం చేసుకుంటా : ఎంపీ విజయసాయి రెడ్డి
వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఆ పార్టీ చీఫ్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. తన ట్వీట్‌లో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.. ''రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను.. ఏ రాజకీయ పార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడం లేదు.. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం.. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను.. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ కు సదా కృతజ్ఞుడిని.. జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నా.. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా.. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు.. టీడీపీతో రాజకీయంగా విభేదించా.. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉంది.. నా భవిష్యత్తు వ్యవసాయం.. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను..'' అని పేర్కొన్నారు.