నా పిల్లలతో పెద్ద బాలశిక్ష చదివిస్తున్న
ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఏపీ ఆరోగ్యమంత్రి సత్యకుమార్ యాదవ్
అనుకరించడం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారని ఏపీ ఆరోగ్యమంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మాతృభాషతో మమేకమైతే తెలివితేటలు పెరుగుతాయన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. మాతృభాష నేర్చుకున్న పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందన్నారు.
నా మాతృభాష మరాఠీ అయినా.. తెలుగులోనే చదువుకున్నాను. నా పిల్లలకు పెద్ద బాలశిక్ష ఇచ్చి చదవమంటున్నాను. సంస్కృతి, వారసత్వం, పండుగలు అన్నీ భాషతోనే ముడిపడి ఉంటాయి. తల్లిదండ్రుల చొరవతోనే మాతృభాష సాధ్యపడుతుందన్నారు. మన తెలుగు భాష ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మైసూర్‌లో తెలుగు భాష అధ్యయన కేంద్రం ఉండేది. 2020 ఏపీకి తీసుకొచి వచ్చారు. కానీ భవనం కేటాయించడానికి వైసీపీ ప్రభుత్వం కృషి చేయలేదు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ట్రస్టుకు చెందిన ఓ భవనాన్ని ఇచ్చారు. ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రానికి కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. త్వరలోనే సొంతభవనం అందుబాటులోకి వస్తుంది. భాషాభివృద్ధి ప్రభుత్వం చేతిలో ఉంటుంది. గత ఐదేళ్లలో తెలుగులో విద్యా బోధనపై నిర్లక్ష్యం ప్రదర్శించారు. తెలుగులో చదివితే ఉద్యోగం రాదు అన్న భావన పెరిగింది. ఆంగ్లభాషపై మక్కువ పెంచే ప్రయత్నం చేశారు అని సత్యకుమార్ యాదవ్ అన్నారు.
సహజ సిద్ధంగా వచ్చేదే మాతృభాష: జేడీ లక్ష్మీ నారాయణ
పిల్లలకు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో బోధన చేయడం దుర్మార్గమని విశ్రాంత పోలీసు అధికారి జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. సహజ సిద్ధంగా వచ్చేదే మాతృభాష, అమ్మ అనే మాటలో ఉన్న మాధుర్యం, మమ్మీ అనే మాటలో ఉండదని పేర్కొన్నారు. భాష అభివృద్ధిలో రాజకీయ నాయకుల పాత్ర చాలా ముఖ్యమైనది. భాషపై సమాజం ఎంత ఆధారపడింది అన్నదాన్ని బట్టి భాష ప్రాధాన్యం, గొప్పదనం తెలుస్తోంది. కృత్రిమ భాషతో పిల్లలకు విద్యాబోధనలు చేయడం వారి వ్యక్తిత్వాన్ని హరించడమే అవుతుంది. ఐదో తరగతి వరకు మాతృభాషలో బోధించాలని జాతీయ విద్యా విధానంలో స్పష్టంగా చెప్పారు. పదో తరగతి వరకు తెలుగు తప్పనిసరిగా ఉంచేలా ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలి. పాఠ్యాంశాల్లో ఏయే అంశాలు ఉండాలో ప్రభుత్వం చర్చించి తగిన చర్యలు తీసుకోవాలి. మాతృభాషను నేర్చుకుంటే ఇతర భాషల్లో సులభంగా ప్రావీణ్యం సంపాదించవచ్చు. కాటుకను కళ్లకు పెట్టుకుంటే అందం.. అలాగని ఒళ్లంతా పులుముకుంటే నల్లబడిపోతారు.. ఇంగ్లీష్ కూడా అంతే అని లక్ష్మీనారయణ పేర్కొన్నారు.