ఎన్నికలకు సిద్ధం అవ్వండి : సీఎం వైఎస్ జగన్
ఒక్క బటన్ నొక్కడం ద్వారా నగదు బదిలీ జరిగి వారి ఖాతాల్లో జమ అయ్యింది. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలి. లబ్దిదారులను ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటే మన ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడుతుందని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు అందరూ ఇప్పటి నుంచే సిద్ధం కావాలని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం గడపగడపకు కార్యక్రమాన్ని ప్రతీ నియోజకవర్గంలో చేపడుతున్నాము. ఎమ్మెల్యేలు అందరూ ఇంటింటికి తిరుగుతున్నారు. మనం చేసిన మేలులు అందరికీ వివరిస్తున్నాము. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో కూడా విచారిస్తున్నాము. ప్రభుత్వంలో ఉన్న మనమంతా మరింత బాగా కృషి చేయాలి మరి కొన్ని నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి అందరూ సన్నద్ధంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. గురువారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన తాడేపల్లి లోని తన క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..
గడపగడపకు కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఎమ్మెల్యేలు కచ్చితంగా 2 రోజులు ఉంటున్నారు. ప్రతీ రోజు కనీసం 6 గంటలు అక్కడే గడుపుతున్నారు. సీఎంగా నేను ప్రతీ కార్యకర్తకు అందుబాటులో ఉండలేకపోవచ్చు. కానీ ఎమ్మెల్యేలకు ఇది సాధ్యమే కదా. అందుకే ప్రతీ ఎమ్మెల్యే గ్రామాల్లో తిరిగి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని జగన్ సూచించారు. ప్రతీ ఇంటికి వెళ్లడం ద్వారా ప్రజల సాధకబాధకాలు తెలుసుకొని వాటిని పరిష్కరించే వీలుంటుందని జగన్ అన్నారు.
అలూరు నియోజకవర్గానికి వివిధ పథకాల ద్వారా గత మూడేళ్ల కాలంలో రూ.1,050 కోట్లు నేరుగా లబ్దిదారులకు బదిలీ చేశాము. ఒక్క బటన్ నొక్కడం ద్వారా నగదు బదిలీ జరిగి వారి ఖాతాల్లో జమ అయ్యింది. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలి. లబ్దిదారులను ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటే మన ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకు కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది. వీలున్నప్పుడు నేను కూడా కార్యకర్తలను కలుస్తున్నాను. ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 100 మందిని కలవాలని అనుకున్నాను. రాబోయే రోజుల్లో మరింత మందిని కలిసి పార్టీ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తాను అని వైఎస్ జగన్ తెలిపారు.