ఏపీలో అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు

తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన పార్టీకి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఆరు నెలలు గడిచాక పరిస్థితులను చూసి ప్రభుత్వం తీరుపై స్పందిద్దామని చెప్పారని అమర్‌నాథ్‌ తెలిపారు.

Advertisement
Update:2024-06-23 08:54 IST

ఆంధ్రప్రదేశ్‌లో అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి.. లోకేష్‌ రాసిన రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. విశాఖపట్నంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలను ఏపీ ప్రభుత్వం టార్గెట్‌ చేయడంపై ఆయన మండిపడ్డారు.

కోర్టు ప్రొసీడింగ్‌లో ఉండగానే తాడేపల్లి కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారని గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. పైగా చేసిందంత చేస్తూ.. అసెంబ్లీలో నీతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో కూటమి సర్కార్‌ సాగిస్తున్న పాలన దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్నామని ఏదైనా చేస్తామంటే పద్ధతి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు వస్తాయని, మీకు వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటున్నారనేది ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన పార్టీకి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఆరు నెలలు గడిచాక పరిస్థితులను చూసి ప్రభుత్వం తీరుపై స్పందిద్దామని చెప్పారని అమర్‌నాథ్‌ తెలిపారు. కానీ, అధికారం చేపట్టి 20 రోజులు పూర్తి కాకముందే రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయాలు తమకు దేవాలయాలతో సమానమన్న అమర్‌నాథ్‌.. దీనిపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. అలాగే.. ఏపీ ప్రజలంతా ఈ కక్షపూరిత రాజకీయ చర్యలను గమనిస్తున్నారని ఆయన తెలిపారు.

Tags:    
Advertisement

Similar News