ముగిసిన ప్రచారం.. నేడు ప్రలోభాల పర్వం
సాధారణ నియోజకవర్గాల్లో మే-13 ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు, అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది. ఈరోజు పూర్తిగా విరామం, రేపు ఉదయాన్నే పోలింగ్ మొదలు. మైక్ లు మూగబోగా.. ఈరోజు నోట్ల కట్టలకు పని పడింది. ప్రలోభాల పర్వం ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రతిసారీ ఎన్నికలు గతంకంటే కాస్ట్ లీ గా మారుతున్నాయి. అటు ప్రచారం ఖర్చు కూడా పెరిగింది, ఇటు ప్రలోభాలకు కేటాయించాల్సిన ఖర్చు కూడా పెరిగినట్టే చెప్పుకోవాలి. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ పై ఈసీ గట్టి నిఘా పెట్టడంతో నేరుగా చేతిలోనే డబ్బు పెట్టి తమ పార్టీకి ఓటు వేయాలని ఒట్టు పెట్టించుకుంటున్నారు కార్యకర్తలు. గతంలో ఒక పార్టీ దగ్గర డబ్బు తీసుకున్నారని తెలిస్తే, ఇంకో పార్టీ వారు జోలికి వచ్చేవారు కాదు. కానీ రాను రాను అందరి వద్దా డబ్బులు తీసుకోవడం, అందులో నచ్చినవారికి ఓటు వేయడం.. అనేది రివాజుగా మారింది. నిజాయితీపరులైన ఓటర్లు ఉన్నా కూడా డబ్బులు డిమాండ్ చేసి మరీ ఓటు వేస్తామనేవారికి కూడా కొదవలేకుండా పోయింది.
ఏపీలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు కలిపి ఎన్నికలు జరుగుతుండగా, తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాధారణ నియోజకవర్గాలన్నిట్లో నిన్న సాయంత్రం 6 గంటలతో ప్రచారానికి ముగింపు పలికారు. అత్యంత సమస్యత్మాక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకే మైకులు మూగబోయాయి. సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటలకు ప్రచారం ఆగిపోయింది. సాధారణ నియోజకవర్గాల్లో మే-13 ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు, అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను, 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో రేపు సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశముంది. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది.
చల్లబడిన వాతావరణం..
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగినన్ని రోజులు ఉష్ణోగ్రతలు దడ పుట్టించినా.. ప్రచారం ముగిసిపోయే దశలో వాతావరణం కూడా చల్లబడింది. మే-13 పోలింగ్ రోజు కూడా వాతావరణం చల్లగానే ఉండే అవకాశముంది. ఇక పోలింగ్ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.