రఘురామకు ఉండి టికెట్‌పై చంద్రబాబు వెనక్కితగ్గారా..?
ఉండిలో 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ)ను నరసాపురం ఎంపీ అభ్యర్థిగా నిలిపి, ఆయన అనుచరుడు రామరాజుకు ఉండి టికెట్ ఇచ్చింది టీడీపీ.
వైసీపీలో ఎంపీగా గెలిచి, నాలుగేళ్లపాటు చంద్రబాబు మనిషిగా పనిచేసిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఎట్టకేలకు ముసుగు తీసి, పచ్చ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే ఆయనకు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తారని ప్రచారం జరిగింది. ఇందుకు సిద్ధపడే చంద్రబాబు రఘురామ కృష్ణరాజును పార్టీలో చేర్చుకున్నారు. అయితే 24 గంటలు తిరక్కముందే సీను మారిపోయింది. ఉండిలో ఇప్పటికే టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనుచరులు తమ నేతను కాదంటే.. టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని సవాల్ చేయడంతో చంద్రబాబు ఏం చేయాలో తోచక వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఓ తలపోటు
ఉండిలో 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ)ను నరసాపురం ఎంపీ అభ్యర్థిగా నిలిపి, ఆయన అనుచరుడు రామరాజుకు ఉండి టికెట్ ఇచ్చింది టీడీపీ. ఆ ఎన్నికల్లో రామరాజు గెలిచారు. ఈసారి శివ, రామరాజు ఇద్దరూ టికెట్ కోసం పోటీపడ్డారు. రామరాజుకే టీడీపీ టికెట్ ఖరారు చేసింది. దీంతో కలవపూడి టీడీపీకి దూరమయ్యారు. తన సత్తా చూపిస్తానని టీడీపీని కలవరపెడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో టికెట్ మారిస్తే ఇబ్బందే
అసలే ఒక పక్క కలవపూడి శివ ఏం చేస్తారోననే ఆందోళనలో ఉన్న టీడీపీ రామరాజును కాదని రఘురామకృష్ణరాజును తెరపైకి తెస్తే మరో వ్యతిరేక వర్గం తయారైనట్లే. అదే జరిగితే రఘురామ ఒక పక్క బలమైన వైసీపీ అభ్యర్థితోపాటు టీడీపీలో రెండు వర్గాలతో పోరాడాలి. అందుకే చంద్రబాబు ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నారు. రామరాజును ఒప్పిస్తేగానీ రఘురామకృష్ణరాజుకు సీటు లేదు. అందుకే ఉండిపై ఇంకా ఏం నిర్ణయం జరగలేదని పాపం ఆర్ఆర్ఆర్ కూడా ఒప్పేసుకుంటున్నారు.