ఇది మాత్రం అస్సలు బాగోలేదు జ‌గ‌న్‌

అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పర్యటనలు చేస్తుంటారని అక్కడెక్కడా ఇలా చెట్లు నరకడం లేదు కదా అన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా నేటి విశాఖ పర్యటన నేపథ్యంలోనూ భారీగా చెట్లను నరికే కార్యక్రమం కొనసాగింది.

Advertisement
Update:2023-05-11 08:18 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పర్యటనలపై ఇప్పటికే టీడీపీ పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం చేస్తోంది. దాన్ని తిప్పికొట్టాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా ప్రతిపక్షాలు విమర్శలు చేసేందుకు కొత్త అంశాలను అందిస్తోంది. ముఖ్యమంత్రి పర్యటనల్లో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఉండాలి కూడా.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనూ అదే జరిగింది. వేల మంది పోలీసులను మోహరించేవారు. కానీ టీడీపీ, ఒక వర్గం మీడియా తీరు మాత్రం ముఖ్యమంత్రిగా జగన్‌ ఒక్కరే పూర్తిగా పోలీసు వలయంలో పర్యటిస్తున్నారన్న భావన కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. భద్రత వరకు కఠిన చర్యలు సమంజసమే అయినా.. సీఎం పర్యటన అంటే చాలు స్థానికంగా ఉండే చెట్లను భారీగా నరికి వేస్తుండటం మాత్రం సమర్థ‌నీయంగా లేదు.

ఇప్పటికే నాలుగైదు పర్యటనల్లో ఇలాగే జరిగింది. గతంతో జగన్‌ విశాఖ వెళ్లినప్పుడు అక్క‌డి సిబ్బంది భారీగా చెట్లను నరికివేశారు. ఇతర జిల్లాల పర్యటనల్లోనూ చెట్ల నరకడం కామన్ అయిపోయింది. ఇలా ఎందుకు చేస్తున్నారన్న దానిపై అధికారుల నుంచి సరైన సమాధానం కూడా లేదు. కేవలం భద్రత కారణాలతో అని మాత్రమే చెబుతున్నారు. సీఎం వెళ్లే దారి పొడవున పోలీసులు అడుగడుగునా మోహరించి ఉంటారని.. అలాంటప్పుడు చెట్ల ద్వారా సీఎం భద్రతకు ముప్పు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.

అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పర్యటనలు చేస్తుంటారని అక్కడెక్కడా ఇలా చెట్లు నరకడం లేదు కదా అన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా నేటి విశాఖ పర్యటన నేపథ్యంలోనూ భారీగా చెట్లను నరికే కార్యక్రమం కొనసాగింది. పీఎంపాలెంలోని క్రికెట్ స్టేడియంలో వైఎస్ విగ్రహావిష్కరణకు జగన్ వస్తున్నారు. స్టేడియం పక్కనే ఉన్న భారీ వృక్షాలను అధికారులు నరికివేయించారు. చెట్లు ఎందుకు నరుకుతున్నారన్న దానిపై సిబ్బంది నుంచి సమాధానం లేదు. పైవాళ్లు చెప్పారు మేం చేస్తున్నామని అంటున్నారు. ఇప్పటికే అనేక పర్యటనల్లో చెట్ల నరికివేతపై విమర్శలు వచ్చినా ఉన్నతాధికారుల నుంచి సరైన వివరణ, హామీ మాత్రం రావడం లేదు. చెట్ల నరికివేత తీవ్ర విమర్శలకు తావిస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ అంశం సీఎం పట్ల వ్యతిరేక భావనకు అవకాశం ఇస్తోంది. వైసీపీ వ్యతిరేక పత్రికలు ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News