17 శాతం మేర తగ్గిన జగన్‌ గ్రాఫ్‌... సీ ఓటర్- ఇండియా టుడే సర్వే

ఇప్పుడు మాత్రం సీ ఓటర్‌- ఇండియా టుడే సర్వే జగన్‌పై ఏపీలో కేవలం 39.7 శాతం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారని చెబుతోంది. అంటే దాదాపు 17 శాతం సానుకూల స్పందన తగ్గింది.

Advertisement
Update:2023-01-29 10:35 IST

వైసీపీ అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చినట్టుంది. కేవలం బటన్‌ నొక్కడాన్ని నమ్ముకుని జగన్ తప్పు చేశారేమో అన్న అనుమానం ఇటీవల బలపడుతోంది. అందుకు తగ్గట్టే ఇటీవల కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ మ‌ధ్య‌కాలంలో జగన్‌పై దాడి పెరిగింది. వైసీపీ అధికారిక ఖాతాల్లోనూ నెటిజన్లు ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ఎదుర్కొంది.

గడిచిన ఆరు నెలల కాలంగా వైసీపీపై ప్రతికూల ప్రచారం తీవ్రమైంది. గతేడాది ఏపీలో జగన్‌కు తిరుగులేదని చెప్పిన సీ ఓటర్‌-ఇండియా టుడే సర్వే కూడా ఇప్పుడు జగన్‌ క్రేజ్‌ తగ్గుతోందని చెబుతోంది. 2022 జనవరిలో ఇదే సర్వే.. ఏపీలో జగన్‌ పనితీరుపై 56.5 శాతం మంది సంతృప్తితో ఉన్నారని చెప్పింది. ఆ సమయంలో ఈ సర్వే రిపోర్టును వైసీపీ చాలా బాగా ప్రచారం చేసుకుంది.

ఇప్పుడు మాత్రం సీ ఓటర్‌- ఇండియా టుడే సర్వే జగన్‌పై ఏపీలో కేవలం 39.7 శాతం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారని చెబుతోంది. అంటే దాదాపు 17 శాతం సానుకూల స్పందన తగ్గింది. దేశంలో బెస్ట్‌ సీఎం ఎవరు అన్న ప్రశ్నకు గతేడాది 3.9 శాతం మంది జగన్‌ పేరు చెప్పారు. ఇప్పుడా ప్రశ్నకు కేవలం 1.6 శాతం మాత్రమే జగన్‌ పేరు చెప్పారు.

ముఖ్యమంత్రుల్లో నవీన్ పట్నాయక్‌ ఖ్యాతి ఏమాత్రం తగ్గడం లేదు. సొంత రాష్ట్రంలో 73.2 శాతం మంది నవీన్‌ పనితరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో అత్యంత సానుకూలత ఉన్న సీఎంగా నవీన్ తొలి స్థానంలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ పాలన బాగుందని 69. 2 శాతం చెప్పారు. దాంతో కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు. గతేడాదితో పోలిస్తే కేజ్రీవాల్ క్రేజ్‌ 10 శాతానికి పైగా పెరిగింది.

Tags:    
Advertisement

Similar News