30మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్..!

ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎన్ని సచివాలయాలను సందర్శించారు, రోజుకి ఎంత సమయం కేటాయిస్తున్నారు.. వంటి లెక్కలన్నీ జగన్ దగ్గర పక్కాగా ఉన్నాయి.

Advertisement
Update:2023-02-13 21:07 IST

అనుకున్నట్టే సీఎం జగన్ మరోసారి ఎమ్మెల్యేలను గట్టిగానే హెచ్చరించారు. గడప గడపకు తిరగకుండా మేనేజ్ చేస్తున్నారంటూ మండిపడినట్టు తెలుస్తోంది. 30మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదంటూ నివేదిక చదివి వినిపించిన జగన్.. ఇకనైనా పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎన్ని సచివాలయాలను సందర్శించారు, రోజుకి ఎంత సమయం కేటాయిస్తున్నారు.. వంటి లెక్కలన్నీ జగన్ దగ్గర పక్కాగా ఉన్నాయి.

ఇప్పటివరకు 7,447 సచివాలయాల్లో గడప గడప కార్యక్రమం జరిగిందని, సగటున నెలలో ఎమ్మెల్యేలు 6 సచివాలయాలను సందర్శించారని లెక్కలు చెప్పారు జగన్. గడప గడపకు వెళ్లి వారికి అందిన సంక్షేమ కార్యక్రమాల చిట్టా వారి చేతిలో పెట్టడంతోపాటు, ప్రతి ఇంట్లో ఉన్నవారిని కూడా పలకరించి వారితో కొంత సమయం గడపాలని సూచించారు జగన్‌. నిర్వహణలో వెనకబడ్డ ఎమ్మెల్యేలు వచ్చే సమీక్ష నాటికి పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. మళ్ళీ ప్రతి ఎమ్మెల్యే గెలవాలంటే, నిరంతరం ప్రజల్లోనే ఉండాలని సూచించారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో గడప గడప మన ప్రభుత్వం కొనసాగించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా మిగతా జిల్లాల్లో నిర్వహించాలని సూచించారు.

మార్చి 18 నుంచి ‘మా భవిష్యత్తు నువ్వే జగన్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు జగన్. ఈలోగా పార్టీ కన్వీనర్లు, సచివాలయ సమన్వయకర్తలకు శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. పలు నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న గృహ సారథులు, కన్వీనర్ల నియామకం పూర్తి చేయాలన్నారు. సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల రూపంలో వైసీపీకి సుమారు 5.65 లక్షలమందితో క్షేత్రస్థాయిలో పార్టీ సైన్యం ఉందని వారంతా, మా భవిష్యత్తు నువ్వే జగన్ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. వారంతా ఏపీలో దాదాపు 1.65 కోట్ల గృహాలను సందర్శిస్తారన్నారు. గృహసారథులను కో–ఆర్డినేట్‌ చేసే బాధ్యతను సచివాలయ కన్వీనర్లకు అప్పగించాలన్నారు జగన్.

Tags:    
Advertisement

Similar News