మొక్కుబడి చదువులొద్దు.. 6 తర్వాత అంతా సీరియస్

మొక్కుబడిగా బోధన చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని అధికారులకు సూచించారు సీఎం జగన్. కనీసం ఆరో తరగతితో అయినా విద్యార్థులు చదువుపై సీరియస్ గా దృష్టిపెట్టేలా చూడాలన్నారు.

Advertisement
Update:2023-02-03 08:13 IST

“నాడు-నేడు కార్యక్రమంలో పిల్లల చదువులకోసం భారీగా ఖర్చు పెడుతున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం, విద్యా దీవెన ఇస్తున్నాం, విద్యా కిట్లు పంపిణీ చేస్తున్నాం, ట్యాబ్ లు ఇస్తున్నాం.. ఇంత చేసీ మనకు ఫలితం కనపడకపోతే అది వృథా. చదువులు మొక్కుబడిగా సాగితే కష్టం. మీరు సీరియస్ గా దృష్టిపెట్టాల్సిందే.” విద్యాశాఖ సమీక్షలో అధికారులకు సీఎం జగన్ ఇచ్చిన సూచన ఇది. కనీసం ఆరో తరగతితో అయినా చదువులు సీరియస్ గా సాగాలన్నారు జగన్. దానికి ఉపాధ్యాయులు తగిన కృషి చేయాలన్నారు, విద్యార్థులను మోటివేట్ చేయాలని చెప్పారు.

మొక్కుబడిగా బోధన చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని అధికారులకు సూచించారు సీఎం జగన్. కనీసం ఆరో తరగతితో అయినా విద్యార్థులు చదువుపై సీరియస్ గా దృష్టిపెట్టేలా చూడాలన్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది ప్రారంభంలోనే ట్యాబ్ లు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యారంగంలో అమలుచేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ అవసరం అని చెప్పారు. అలా చేస్తేనే విద్యాకానుక, మౌలిక సదుపాయాలు, గోరుముద్ద వంటి కార్యక్రమాల నాణ్యత పెరుగుతుందన్నారు. ప్రతి ఏటా విద్యాకానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలన అవసరం అన్నారు.

ఆంగ్లంలో ప్రావీణ్యం అవసరం..

ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడటం, రాయడంలో ప్రావీణ్యం సాధించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కేంబ్రిడ్జ్‌ లాంటి సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని, వారి సహాయంతో మూడోతరగతి నుంచే ఇంగ్లిష్ ప్రావీణ్యం కోసం పరీక్షలు నిర్వహించి, సర్టిఫికెట్లు జారీచేసే కార్యక్రమం రూపొందించాలని సూచించారు. ఉపాధ్యాయులకు ఆంగ్లభాషపై శిక్షణ కొనసాగించాలన్నారు. హైస్కూల్ లెవల్ లో ఐఎఫ్‌బీ ప్యానెల్స్‌, ఐదో తరగతిలోపు టీవీ స్క్రీన్లు ఏర్పాటుచేయాలన్నారు. డిజిటల్ బోధనతోనే అభ్యసన సులభం అవుతుందన్నారు. విద్యార్థులకు ఇస్తున్న ట్యాబ్ లతో.. ఇంటి దగ్గర కూడా పిల్లలు ఆడియో, వీడియో పాఠ్యాంశాలను నేర్చుకునే అవకాశం కల్పించామని, ట్యాబ్‌ల వినియోగం, పాఠ్యాంశాలను నేర్చుకుంటున్న తీరుపై పిల్లల తల్లిదండ్రులకు తగిన సమాచారం ఇవ్వాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News