కోఆర్డినేటర్లకే పెత్తనం.. ఆ బాధ్యత మీదేనన్న జగన్
పార్టీ సమన్వయ కర్తలు ఎప్పుడైనా తన వద్దకు రావొచ్చని, తనను ఎప్పుడైనా కలవొచ్చని చెప్పారు సీఎం జగన్. పార్టీ పరంగా మీరే నాకు టాప్ ప్రయారిటీ అని అన్నారు.
ఎమ్మెల్యేలతో రివ్యూ మీటింగ్ జరిగిన మరుసటి రోజు.. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం జగన్, వచ్చే ఎన్నికల్లో వారిదే కీలక బాధ్యత అని చెప్పారు. పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సంవత్సరం మాత్రమే సమయం ఉందని గుర్తు చేసిన జగన్, ఈ ఏడాదిలో మరింత విస్తృతంగా పార్టీ, ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని చెప్పారు.
లోటుపాట్లు సరిదిద్దాల్సింది మీరే..
వైసీపీలో ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు అనే పదవి దాదాపుగా కనుమరుగైపోయింది. జిల్లాలో ఏం జరిగినా వెంటనే రీజనల్ కోఆర్డినేటర్లు వచ్చేస్తున్నారు. వారి సమక్షంలోనే పంచాయితీలు పెడుతున్నారు. వారి ద్వారానే అధిష్టానానికి అధికారిక సమాచారం వెళ్తోంది. ఇకపై కూడా రీజనల్ కోఆర్డినేటర్లే అన్ని బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు సీఎం జగన్. మీరే ఓనర్ షిప్ తీసుకోవాలంటూ సూచించారు. మీకు అప్పగించిన జిల్లాల్లో పార్టీ నేతలను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీదేనన్నారు. లోటుపాట్లు ఉంటే సరిదిద్దాలని, అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకురావాలన్నారు. అంతిమంగా మన అభ్యర్థులకు మంచి మెజార్టీ వచ్చేట్టు చేయాలని చెప్పారు.
ఎప్పుడైనా ఓకే..
పార్టీ సమన్వయ కర్తలు ఎప్పుడైనా తన వద్దకు రావొచ్చని, తనను ఎప్పుడైనా కలవొచ్చని చెప్పారు సీఎం జగన్. పార్టీ పరంగా మీరే నాకు టాప్ ప్రయారిటీ అని అన్నారు. సచివాలయ కన్వీనర్ల రూపంలో, గృహసారథుల రూపంలో పార్టీకి కింది స్థాయిలో చక్కటి యంత్రాంగం ఉందని, దాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు జగన్. గడప గడప కార్యక్రమంతోపాటు, మా నమ్మకం నువ్వే జగన్.. ని కూడా సజావుగా, సమర్థంగా ఆయా నియోజకవర్గాల్లో నడిచేలా రీజనల్ కోఆర్డినేటర్లు పర్యవేక్షించాలన్నారు. సమన్వయ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.