గేలం రెడీ చేస్తున్న బాబు.. నేషనల్ ఛానెల్స్ లో మోదీ భజన
జాతీయ ఛానెల్ లో చంద్రబాబు చేసిన మోదీ భజనను.. ఇక్కడ టీడీపీ అనుకూల మీడియా హైలెట్ చేస్తోంది. టీడీపీ, బీజేపీ కలసిపోతున్నాయంటూ ప్రచారం మొదలుపెట్టింది.
2024 ఎన్నికలను చంద్రబాబు ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు..?
ఎ) ఒంటరిగా
బి) జనసేనతో కలసి
సి) బీజేపీ, జనసేనతో కలసి మహా కూటమిగా ఏర్పడి
ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకి లేదు అని ఈపాటికే తేలిపోయింది. జనసేనతో కలసి కూటమిగా ఏర్పడితే కొంతవరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలిపోకుండా చేయొచ్చు, బీజేపీతో కూడా కలసి పోటీ చేస్తే, ఆ కాస్త అవకాశం కూడా వైసీపీకి ఇవ్వకుండా ఉండొచ్చు. పైగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఆశీస్సులు కూడా తనపై ఉంటాయి. అందుకే బాబు ఈ ఎత్తుగడ వేశారు. దాన్ని ఇప్పుడు అమలులో పెట్టారు.
నేషనల్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు..
ఇటీవల ఓ నేషనల్ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు, మోదీ భజన మొదలు పెట్టారు. దేశాభివృద్ధి కోసం.. తెలుగు ప్రజల కోసం తన పరిధిలో తాను పనిచేస్తున్నానని, ప్రధాని మోదీ విజన్ తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా తన పరిధి మేరకు కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు. భారతదేశ బలాన్ని ప్రధాని మోదీ ప్రపంచానికి చాటి చెబుతున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. గతంలో కూడా తాను మోదీ పాలసీలను వ్యతిరేకించలేదని, ఏపీ ప్రజల సెంటిమెంట్ గా మారిన ప్రత్యేక హోదా విషయంలోనే పోరాడానని కవర్ చేసుకున్నారు.
అనుకూల మీడియాతో కుప్పిగంతులు..
జాతీయ ఛానెల్ లో చంద్రబాబు చేసిన మోదీ భజనను.. ఇక్కడ టీడీపీ అనుకూల మీడియా హైలెట్ చేస్తోంది. టీడీపీ, బీజేపీ కలసిపోతున్నాయంటూ ప్రచారం మొదలుపెట్టింది. వాస్తవానికి బీజేపీకి, టీడీపీతో కలిసే ఆలోచన లేనే లేదు. జనసేనతో మాత్రమే కలసి పోటీ చేయాలనుకుంటున్నారు ఏపీలో కమలనాథులు. కానీ బాబు నేరుగా అధిష్టానాన్ని లైన్లో పెట్టే పని మొదలు పెట్టారు. ఈ గేలానికి బీజేపీ చిక్కుతుందా, మరోసారి బాబుతో చేయి కలుపుతుందా అనేది వేచి చూడాలి.