విశాఖ పరిణామాలతో మారుతున్న సమీకరణలు
విశాఖలో జరిగిన సంఘటనలు..అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం కొత్త సమీకరణలకు దారితీస్తున్నదా ? ముఖ్యంగా జనసేన, బిజెపి, టిడిపి పొత్తుల అంశంపై సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. ఇందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలే కారణంగా కనిపిస్తున్నాయి.
ఇటీవల విశాఖ లో జరిగిన సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాలకు దారి తీశాయి. ఎప్పుడో ఆలోచించవచ్చులే అన్న విషయాలపై ఇప్పుడే దృష్టి సారించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా జనసేన, బిజెపి, టిడిపి పొత్తుల అంశంపై సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. ఇందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలే కారణంగా కనిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలిసి నడవాలంటే టిడిపి ని కూడా కలుపుకుని పోవాలనేది పవన్ ఆకాంక్షగా కనబడుతోంది. అయితే కేంద్రం, రాష్ట్రంలోనూ కొంతమంది బిజెపి నాయకులకు టిడిపితో జత కట్టడం ఇష్టం లేదనేది కూడా స్పష్టమే. అంటే టిడిపితో బిజెపి కలవడం అనుమానమే.ఇటువంటి పరిస్థితుల్లో జనసేన టిడిపి కి ప్రాధాన్యం ఇస్తుందా లేక బిజెపి వైపు మొగ్గు చూపుతుందా అనేది చర్చనీయాంశం అవుతోంది.
ఇప్పటివరకూ లోపాయికారీగా పొత్తులపై మాట్లాడుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు నిన్నటి ప్రత్యేక భేటీ కొన్ని అనుమానాలకు తెరదించింది. విపక్ష పార్టీలపై ప్రభుత్వ వైఖరిని ఎదుర్కొనేందుకు మనమంతా ( పార్టీలన్నీ) ఏకమవ్వాలని టిడిపి, జనసేన అధినేతలు నిర్ణయించడంతో ఈ మైత్రి ఎన్నికల వరకూ కొనసాగవచ్చని భావిస్తున్నారు.
వీరిద్దరి భేటీకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనవసరం లేదని బిజెపి భావిస్తోంది. అయినప్పటికీ రానున్న రోజుల్లో తాము ఎవరితో కలిసి సాగుతామనే విషయాన్ని ఇంకా సస్పెన్స్ గానే ఉంచుతోంది. అప్పటి పరిణామాలను అనుసరించి నిర్ణయాలు తీసుకోవాలనేది బిజెపి అధిష్టానం ఆలోచనగా ఉందంటున్నారు. రాష్ట్రంలో బిజెపికి అధికారంలోకి వచ్చేంత సొంత బలం లేదు. ఒకవేళ ఎన్నికల నాటికి కూడా టిడిపి పట్ల ఇదే వైఖరి కొనసాగితే జనసేనాని పవన్ మాత్రం టిడిపి వైపే నడుస్తారనేది విశ్లేషకుల అంచనా. ఈ రెండు పార్టీలు కలిసి నడిస్తే సహజంగానే వామపక్షాలు కూడా వీటితో జతకలుస్తాయి. ఈ విషయాన్ని సిపిఐ నేత రామకృష్ణ స్పష్టం చేశారు కూడా. బిజెపితో కలవబోమని పవన్ క్లారిటీ ఇస్తే, టిడిపి, జనసేనలతో కలిసి నడిచేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు.
అప్పుడు బిజెపి ఎన్నో కొన్ని సీట్లనయినా గెలుచుకుని పార్టీ ఉనికిలోనే ఉందని నిరూపించుకోవాలి. అందుకు వైసీపితో బాహాటంగా కానీ, లోపాయికారీగా కానీ ఒప్పందం కుదుర్చుకుని పదుల సంఖ్యలో సీట్లు తీసుకుని గెలవాలనే ఆలోచన కూడా చేయవచ్చని అంటున్నారు. ఎందుకంటే బిజెపి-వైసీపి ల మధ్య ఎటువంటి విభేదాలు లేవు. పైగా టిడిపి,జనసేనలను ఓడించాల్సిఉంటుంది. కాబట్టి వైసీపికి అభ్యంతరం ఉండకపోవచ్చు. బిజెపి కూడా లోక్ సభ సీట్లకే పట్టుబట్టవచ్చు అసెంబ్లీ సీట్లపై పెద్దగా పట్టింపు ఉండదు. అందువల్ల వీరిద్దరూ ఒక అంగీకారానికి రావడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. టిడిపి, జనసేనలతో బిజెపి జతకలవకపోతేనే ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే అప్పుడు వామపక్షాలు తమ దారి తాము చూసుకోకతప్పదు. ఓ వైపు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఈ మూడు పార్టీలను ఎదుర్కొని బరిలో నిలబడాల్సి ఉంటుంది. ఎన్నికల సమయానికి ఇంకా ఎన్ని పార్టీలు తెరమీదికి వస్తాయో, ఏ పార్టీ ఓటు బ్యాంకుకు చేటు చేస్తాయో కూడా చూడాలి.