తిరుమలలో వీఐపీల హడావిడి..సామాన్య భక్తుల ఇక్కట్లు
తిరుమలలో వీఐపీలతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల దివ్యక్షేత్రం గోవిందనామస్మరణతో మారుమ్రోగింది. తిరుమలకు వీఐపీల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల శ్రీవారిని దర్శించుకునేందుకు విచ్చేస్తున్నారు. దీంతో గంటల తరబడి లైన్లో వేచిచూస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకరి వెనుక మరొకరు వీఐపీ దర్శనం కోసం వస్తుంటే సామాన్యలను ఎక్కడికక్కడే ఆపేస్తున్నారు.మరోవైపు లైన్లలో నిలబడి సామాన్యుల ప్రాణాలు పోతున్నా తిరుమలలో వీఐపీ దర్శనాలు ఆపరా? అని కొందరు టీటీడీపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఐపీల రచ్చతో ఎక్కడెక్కడి నుండో వచ్చిన భక్తులు నానా అగచాట్లు పడుతున్నారు. ఏ పరపతిలేని సామాన్య భక్తులు దర్శనం కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు వర్షం కురిస్తే నానా ఇబ్బందులు పడుతున్నారు.
క్యూలైన్లలో ఉన్న వారు వర్షం తాకిడికి పూర్తిగా తడిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇలా సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతుంటే, మంత్రుల, ప్రజాప్రతినిధులు మాత్రం పెద్ద ఎత్తున అనుచరులను వెంటేసుకుని వస్తున్నారని సామాన్య భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంత్రులు పెద్ద సంఖ్యలో అనుచరులను దర్శనానికి తీసుకొచ్చారు. ఒకేసారి 60 నుంచి 80 మందిని తమతోపాటు ఆలయంలోకి తీసుకెళ్లే వరకు ఊరుకోలేదు. గతంలో ఓ మంత్రి అయితే ఏకంగా 150 మందితో వచ్చి ఆలయం దగ్గర చేసిన యాగి అంతా ఇంతా కాదు. వచ్చిన వాళ్లు అమాత్యులు కావడంతో.. టీటీడీ అధికారులు కూడా కాదన లేకపోతున్నారు. శ్రీవారి సాక్షిగా నిబంధనలకు నీళ్లొదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కళ్లెదుటే సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నా మంత్రులకు చీమ కుట్టినట్టు అయినా ఉండటం లేదు. తమతోపాటు.. వెంట వచ్చిన అనుచరుల సేవలో టీటీడీ తరిస్తే చాలు అనుకుంటున్నారు.