రేపటి నుంచి సెలవులు..బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అప్పుడే మొదలైంది.

Advertisement
Update:2025-01-09 19:54 IST

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అప్పుడే మొదలైంది. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి తెలుగు వారు కుటుంబాలతో సొంతూళ్లకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో, ఏపీలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఏపీలో స్కూళ్లకు రేపటి నుంచి సెలవులు ఇచ్చారు. దీంతో సొంతూళ్లకు కుటుంబంతో సహా ప్రజలంతా బయల్దేరారు. విజయవాడలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. నగరంలోని నెహ్రూ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ లో విపరీతమైన రద్దీ నెలకొంది. ముఖ్యంగా, హైదరాబాద్ నుంచి విజయవాడకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కోస్తా జిల్లాలకు, ఉత్తరాంధ్రకు వెళ్లేవారు ఎక్కువమంది ఉండడంతో అధికారులు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు.

విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు 114 అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని అధికారులు తెలిపారు. అటు, ప్రయాణికుల తాకిడితో రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కళకళలాడుతోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎవ్వరికీ ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులు ఎక్కువగా ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో తెలుసుకుని బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. బస్సు ఛార్జీలు పెంచకపోవడంతో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News