ఢిల్లీ పెద్దల ముందు ఏపీ కోర్కెల చిట్టా..
ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీని కలిశారు చంద్రబాబు. ఏపీకి సంబంధించిన కోర్కెల చిట్టాను వారి ముందుంచారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందడిగా సాగుతోంది. పార్టీ ఎంపీలు, టీడీపీకి చెందిన కేంద్ర మంత్రుల్ని వెంటబెట్టుకుని మరీ ఆయన ప్రభుత్వంలోని పెద్దల్ని కలుస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీని కలిశారు చంద్రబాబు. ఏపీకి సంబంధించిన కోర్కెల చిట్టాను వారి ముందుంచారు.
- రాష్ట్రానికి ఆర్థిక సాయం, రాష్ట్ర పునర్‌నిర్మాణానికి అవసరమైన సహకారం
- రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు నిధులు
- అమరావతి నిర్మాణానికి సహకారం
- పోలవరం సకాలంలో పూర్తయ్యేందుకు తోడ్పాటు
- అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి నిధులు
- రహదారుల మరమ్మతులకు నిధులు
- పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు
- జల్‌జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీటి సరఫరా వంటి అంశాలపై చంద్రబాబు.. ప్రధాని, కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు అందించారు.
కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీని కలసిన సందర్భంగా వినతిపత్రాలు అందించారు సీఎం చంద్రబాబు. విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారని, ఈ భేటీలోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. రాజధాని అవుటర్ రింగ్ రోడ్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా అనుమతి లభించిందని అన్నారు. ఢిల్లీ పర్యటన గురించి చంద్రబాబు పూర్తి వివరాలు తానే స్వయంగా తెలియజేసే అవకాశముంది.