చంద్రబాబు భద్రతాధికారికి రాయి దెబ్బ
రాళ్ల దాడిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పులివెందుల రాజకీయాలు చేయవద్దు జగన్ అని హెచ్చరించారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లనే రాళ్ల దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పర్యటనలో ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు రాయి తగలడం వివాదాస్పమైంది. గుర్తు తెలియని వ్యక్తి చంద్రబాబు వాహనంపైకి రాయి విసిరారు. అది చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబును తాకింది. రాయి నేరుగా గడ్డానికి తాకడంతో మధుబాబుకు తీవ్ర రక్త స్రావం అయింది. దాంతో ఆయన్ను చికిత్స కోసం తీసుకెళ్లారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈ ఘటన జరిగింది.
దాడితో చంద్రబాబు ఎన్‌ఎస్‌జీ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. 12 మందితో కూడిన భద్రతా బృందం చంద్రబాబుకు చుట్టూ రక్షణగా నిలబడ్డారు. ఆయన వాహనం చుట్టూ అదనపు భద్రత ఏర్పాటు చేశారు. చంద్రబాబు రోడ్ షో తక్షణం ముగించాలంటూ పోలీసులు ఆదేశించడం వివాదాస్పదమైంది. టీడీపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
రాళ్ల దాడిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పులివెందుల రాజకీయాలు చేయవద్దు జగన్ అని హెచ్చరించారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లనే రాళ్ల దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అసమర్థులు దొంగల్లాగా రాళ్ల దాడికి దిగారని.. ఇలాంటి దాడులకు భయపడే పార్టీ టీడీపీ కాదని చంద్రబాబు హెచ్చరించారు.