ఇక తేల్చుకోవాల్సింది పవనేనా?

టీడీపీ లేకుండా బీజేపీతో మాత్రమే కలిసి ఎన్నికలకు వెళ్ళాలా? లేకపోతే బీజేపీని వదిలేసి టీడీపీతో చేతులు కలపాలా? ఇదే ఇప్పుడు పవన్ ముందున్న ప్రశ్న.

Advertisement
Update:2023-07-20 09:54 IST

పవన్ కల్యాణ్

ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్రిప్ కంటిన్యూ అవుతోంది. మంగళవారం సమావేశం అయిపోయిన తర్వాత బుధవారం ఉదయం ఏపీ ఇన్‌చార్జి మురళీధరన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. గురువారం కూడా పవన్ ఢిల్లీలోనే ఉండబోతున్నారు. బహుశా నరేంద్ర మోడీ అపాయిట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారేమో. అమిత్ షాతో భేటీలో టీడీపీ పొత్తు గురించి మాట్లాడేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి.

అయితే బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నా డిసైడ్ చేయాల్సింది మోడీ మాత్రమే. మోడీ ఆదేశాలనే అమిత్ షా అయినా నడ్డా అయినా ఫాలో అవుతారు. టీడీపీతో పొత్తు పెట్టుకునేట్లుగా బీజేపీ పెద్దలను ఒప్పించాలన్నది పవన్ ఆలోచన. అయితే అందుకు ఎవరూ సానుకూలంగా స్పందించటంలేదు. ఎన్డీఏ మిత్ర‌ప‌క్ష‌ సమావేశానికి టీడీపీని పిలవలేదంటేనే బీజేపీ పెద్దల ఆలోచనను పవన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎన్డీఏలో ఒక్క ఎంపీ కూడా లేని పార్టీలు కూడా భాగస్వామ్య పార్టీలే. ఆ మాటకొస్తే జనసేనకు కూడా ఎవరూ లేరు. కానీ జనసేన గడచిన నాలుగేళ్ళుగా మిత్రపక్షం.

ఇప్పుడు కొత్తగా ఏడు పార్టీలను ఎన్డీఏలోకి చేర్చుకున్నారు. ఈ పార్టీల్లో దేనికీ ఒక్క ఎంపీ కూడా లేరు. అలాంటిది నలుగురు ఎంపీలున్న టీడీపీని ఎందుకు ఆహ్వానం పంపలేదు? ఎందుకంటే చంద్రబాబునాయుడుతో చేతులు కలపటం మోడీకి ఇష్టంలేదు కాబట్టే. పవన్‌కు ఈ విషయం అర్థ‌మవుతోందా? లేకపోతే అర్థంకానట్లు నటిస్తున్నారా అన్నదే తెలియ‌డంలేదు. సరే ఎవరి ఆలోచనలు ఎలాగున్నా జరిగిందయితే అందరికీ తెలిసిపోయింది.

ఇక తేల్చుకోవాల్సింది పవనే. టీడీపీ లేకుండా బీజేపీతో మాత్రమే కలిసి ఎన్నికలకు వెళ్ళాలా? లేకపోతే బీజేపీని వదిలేసి టీడీపీతో చేతులు కలపాలా? ఇదే ఇప్పుడు పవన్ ముందున్న ప్రశ్న. మరి రెండింటిలో ఏ ఆప్షన్‌ను పవన్ ఎంచుకుంటారో చూడాలి. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళితే మరికొంతకాలం జనసేన బ‌తికి బట్టకట్టే అవకాశముంది. అలాకాకుండా టీడీపీతో కలిస్తే జనసేన భవిష్యత్తు అనుమానమే. 2024 ఎన్నికల్లో టీడీపీ+జనసేన గెలిస్తే ఓకే. ఒకవేళ ఓడిపోతే మాత్రం టీడీపీతో పాటు జనసేన కూడా ఉనికి కోల్పోవ‌డం ఖాయమ‌నే చెప్పాలి.

Tags:    
Advertisement

Similar News