భూపతిరాజు శ్రీనివాసవర్మ.. ఫస్ట్ బాల్‌కే సిక్స్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
నరసాపురం ఎంపీగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాసవర్మ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. అంతకుముందు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ, ఆయన స్థాయి కౌన్సిలర్ స్థాయేనని అందరికీ తెలుసు.
భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆదరణ అంతంతమాత్రమే. టీడీపీ, జనసేన లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే ఆ పార్టీకి కాసిన్ని సీట్లు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభంజనంతో 8 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు గెలిచేసింది. ఇంకేముంది నాకు మంత్రి పదవి ఖాయమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సీఎం రమేష్ ఎవరికి వాళ్లు లెక్కలేసుకున్నారు. కానీ అనూహ్యంగా నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మ అమాత్యపదవి ఎగరేసుకుపోయారు. ఎన్నికల్లో నిలబడి ఎంపీగా గెలవడమే సంచలనం అనుకుంటే కేంద్ర మంత్రి కూడా అయ్యి ఫస్ట్‌బాల్‌కే సిక్స్ కొట్టడమే కాదు.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అయ్యారని బీజేపీ క్యాడర్ సంబరాలు చేసుకుంటోంది.
కౌన్సిలర్ నుంచి కేంద్ర మంత్రి
నరసాపురం ఎంపీగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాసవర్మ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. అంతకుముందు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ, ఆయన స్థాయి కౌన్సిలర్ స్థాయేనని అందరికీ తెలుసు. 2013లో బీజేపీ నుంచి భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా గెలిచారు. ఎప్పుడూ ఎమ్మెల్యే కూడా కాని ఆయన పొత్తులో నరసాపురం ఎంపీ సీటు దక్కించుకున్నారు. అటు వైసీపీ కూడా అదే కౌన్సిలర్ స్థాయి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వడం వర్మకు కలిసొచ్చింది. దీనికి తోడు గోదావరి జిల్లాలను ఊడ్చేసిన కూటమి గాలి ఆయన్ను ఎంపీని చేసేసింది. ఆయన అదృష్టం అక్కడితో ఆగలేదు. పార్టీ విధేయులకు మంత్రి పదవులు ఇవ్వాలన్న బీజేపీ స్కీమ్‌లో ఆయన ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు.
2014లో ఏపీ మంత్రిగా మాణిక్యాలరావు
2014లో టీడీపీ జనసేన పొత్తుతో బీజేపీ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం స్థానాన్ని దక్కించుకుంది. బీజేపీ నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు గెలిచారు. పొత్తులో గెలవడమే కాదు, తొలిసారే గెలిచినా ఏకంగా మంత్రి కూడా అయ్యారు. సొంత వార్డులో రెండుసార్లు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయిన మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా నిలబడిన తొలిసారే గెలిచి మొదటి బంతికే సిక్స్ కొట్టేశారు. మంత్రి పదవి కూడా దక్కించుకుని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గానూ నిలిచారు. ఇప్పుడు ఆ నియోజకవర్గ ఎంపీ శ్రీనివాసవర్మ కూడా ఇలాగే గెలిచి, మంత్రిగా నిలిచారు. వీరిద్దరూ ఒకే పార్టీ వారు. మంచిస్నేహితులు కూడా కావడం విశేషం.