రేపే ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఏపీలో పట్టభద్రులు, టీచర్లు ఎటువైపు..?
సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు 13 ఉమ్మడి జిల్లాల్లో 9 జిల్లాల అభిప్రాయాన్ని వెల్లడించబోతున్నాయి. 13న పోలింగ్, 16న కౌంటింగ్, ఫలితాల ప్రకటన ఉంటుంది.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఏపీలోని 9 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
తూర్పు రాయలసీమ నియోజకవర్గానికి సంబంధించి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గం, టీచర్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గానికి సంబంధించి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గం, టీచర్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. ఇక ఉత్తరాంధ్ర నియోజకవర్గానికి సంబంధించి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కేవలం పట్టభద్రుల నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి.
బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరుగుతుంది. ఇప్పటికే బ్యాలెట్ బాక్స్ లు, సామగ్రి.. పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రయారిటీ ఓటింగ్ లో పార్టీల సింబళ్లు ఉండవు. అభ్యర్థుల పేర్లు, వారి ఫొటోల ఎదురుగా 1, 2, 3 అనే అంకెలు మాత్రమే వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపర్ పై టిక్ మార్క్ లు, వ్యాఖ్యానాలు, సంతకాలు.. ఇతర ఎలాంటి మార్కింగ్ చేసినా ఓట్లు చెల్లుబాటు కావు.
పట్టభద్రుల, టీచర్ల నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థుల విజయం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి అధికార వైసీపీ విజయంపై ధీమాతో అభ్యర్థుల్ని బరిలో దింపింది. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లలో డిగ్రీ పాస్ అయిన వారి ఓట్లు తమకే గుంపగుత్తగా పడతాయనే అంచనా వేసుకుంది. ఇక ప్రైవేట్ టీచర్ల ఓట్లు కూడా తమకే వస్తాయని వైసీపీ ఆశిస్తోంది. ప్రభుత్వ టీచర్లలో ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని టీడీపీ భావిస్తోంది. మధ్యలో పీడీఎఫ్ పరిస్థితి ఈసారి అగమ్యగోచరంగా ఉంది.
దొంగఓట్లు, కరెన్సీ నోట్లు..
గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో దొంగఓట్ల వ్యవహారం చాలా తక్కువ, అలాగే ఓటుకు నోటు కూడా ఎక్కడా కనపడేది కాదు. కానీ ఈసారి రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చాలా చోట్ల దొంగఓట్లు చేరిపోయాయనే ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రలోభాల పర్వం కూడా ఇప్పటికే మొదలైంది. ఓటుకి 5వేల రూపాయల వరకు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు జరిగే 9 జిల్లాల్లో కోడ్ అమలులో ఉంది. మద్యం షాపుల్ని మూసివేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
రెఫరెండమేనా..?
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను 2024 సార్వత్రిక ఎన్నికలకు రెఫరెండంగా భావించాలని చెబుతోంది టీడీపీ. వైసీపీ మాత్రం అలాంటి సవాళ్లేవీ విసరలేదు. ప్రభుత్వంపై ఉన్న నమ్మకమే తమని గెలిపిస్తుందని చెబుతున్నారు వైసీపీ నేతలు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు 13 ఉమ్మడి జిల్లాల్లో 9 జిల్లాల అభిప్రాయాన్ని వెల్లడించబోతున్నాయి. 13న పోలింగ్, 16న కౌంటింగ్, ఫలితాల ప్రకటన ఉంటుంది.