2024లో కూడా 'కోడి కత్తి' హైలెట్ అవుతుందా..?

కోడికత్తి కేసులో నిందితుడికి శిక్ష ఎప్పుడు వేస్తారనేది తేలాల్సి ఉంది. ఈలోగా దీనిపై రాజకీయ ఆరోపణలు పెరిగిపోతున్నాయి. 2024 ఏపీ ఎన్నికల్లో కూడా కోడికత్తి రాజకీయ అంశంగా మారే అవకాశముంది.

Advertisement
Update:2023-04-15 08:34 IST

2024లో కూడా 'కోడి కత్తి' హైలెట్ అవుతుందా..?

2019 ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో 'కోడికత్తి' వ్యవహారం హైలెట్ గా మారింది. జగన్ పై జరిగిన ఆ దాడి ఎవరికి, ఏమేరకు రాజకీయ లాభం చేకూర్చిందో తెలియదు కానీ, 2024 నాటికి కూడా ఆ వేడి చల్లారేలా లేదు. జగన్ పై దాడి అంటూ అప్పట్లో వైసీపీ అనుకూల మీడియా హైలెట్ చేసుకోగా, కోడికత్తి కేసు అంటూ టీడీపీ అనుకూల మీడియా కామెడీ చేసేది. ఆ కేసులో నిందితుడికి బెయిల్ రాకపోవడం, ఇప్పటి వరకు శిక్ష ఖరారు కాకపోవడం కూడా మరో విశేషం. ఎయిర్ పోర్ట్ లో దాడి జరగడంతో NIA ఈ కేసులో విచారణ చేపట్టింది.

ఎందుకిలా..?

జగన్ పై దాడి జరిగింది వాస్తవం, ఆయనకు గాయం కావడం, చొక్కాకు రక్తపు మరక అంటుకోవడం కూడా నిజమే. దాడి చేసిన జనపల్లి శ్రీనివాసరావు కూడా దాన్ని ఒప్పుకున్నారు. కానీ కేసు మాత్రం ఎడతెగకుండా సాగిపోతోంది. ఇప్పటికీ ఇంకా అది ఓ కొలిక్కి రాలేదు. ఆ మధ్య సాక్ష్యాలు మాయమయ్యాయనే వార్త తర్వాత తాజాగా కోర్టులో వాదనలు జరగడం ఇందులో కొత్త విషయం.

కోడికత్తి దాడిలో కుట్రకోణం ఉందని లోతైన దర్యాప్తు జరపాలని ఈ నెల 10న జగన్ తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ NIA లోతైన దర్యాప్తు అవసరం లేదని చెప్పింది. ఆ పిటిషన్‌ ను కొట్టివేయాలని కోరింది. ఈ క్రమంలోనే గతంలో NIA కి నిందితుడు శ్రీనినాసరావు ఇచ్చిన వాంగ్మూలం బయటకు వచ్చింది. జగన్ కి మేలు చేసేందుకే తాను ఆ పని చేసినట్టు శ్రీనివాసరావు NIA కి వాంగ్మూలం ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇందులో కుట్రకోణం లేదని NIA తేల్చి చెప్పడం కూడా విశేషం. ఒకరకంగా ఇది జగన్ కి, వైసీపీకి ఇబ్బందికర పరిణామమే. కోడికత్తిని సింపతీకోసం వాడుకున్నారని ఇప్పుడు టీడీపీ విమర్శల డోసు పెంచింది.

కోడికత్తి కేసులో నిందితుడికి శిక్ష ఎప్పుడు వేస్తారనేది తేలాల్సి ఉంది. ఈలోగా దీనిపై రాజకీయ ఆరోపణలు పెరిగిపోతున్నాయి. 2019 ఎన్నికల్లో కోడికత్తి వ్యవహారం హైలెట్. 2024 ఏపీ ఎన్నికల్లో కూడా కోడికత్తి రాజకీయ అంశంగా మారే అవకాశముంది. 

Tags:    
Advertisement

Similar News