హైకోర్టు నోటీసులు.. బొత్స సెటైర్లు

హైకోర్టు నోటీసులపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాస్త వెటకారంగా స్పందించారు. అమ్మ ఒడి సభలకు విద్యార్థులు, తల్లిదండ్రులు రాకపోతే సినీ నటులు వస్తారా అని ప్రశ్నించారు.

Advertisement
Update:2023-07-28 19:09 IST

అమ్మఒడి వ్యవహారం ఏపీలో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. అమ్మఒడి సభలకు విద్యార్థులను తరలించడం సబబు కాదని హైకోర్టు తెలిపింది. రాజకీయ సభలకు విద్యార్థులను తరలించకూడదంటూ స్పష్టమైన ఆదేశాలున్నా, అధికారులు వాటిని ఉల్లంఘించారంటూ ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్, హోంశాఖ కార్యదర్శి హరీష్ గుప్తాకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

ఆదివాసి గిరిజన చైతన్య వేదిక అధ్యక్షులు చొక్కారావు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థులను రాజకీయ సమావేశాలకు తరలించరాదని హైకోర్టు ఆదేశాలు ఉన్నా ఏపీ అధికారులు వాటిని ఉల్లంఘించారని, విజయనగరం జిల్లా కురుపాంలో జరిగిన అమ్మఒడి సభకు విద్యార్థులను తరలించారని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇద్దరు అధికారులకు నోటీసులిచ్చింది.

సినిమా యాక్టర్లు వస్తారా..?

హైకోర్టు నోటీసులపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాస్త వెటకారంగా స్పందించారు. అమ్మ ఒడి సభలకు విద్యార్థులు, తల్లిదండ్రులు రావడం తప్పు కాదన్నారాయన. విద్యార్థులు, తల్లిదండ్రులు రాకపోతే ఇలాంటి కార్యక్రమాలకు సినీ నటులు వస్తారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో కోర్టు మార్గదర్శకాలు ఇస్తే, వాటిని పాటిస్తామని చెప్పారు మంత్రి బొత్స.

Tags:    
Advertisement

Similar News