ఐఏఎస్‌ల‌ను తక్షణం అదుపులోకి తీసుకోవాలన్న ఏపీ హైకోర్టు..

పశ్చిమగోదావరి జిల్లా జూనియర్ కాలేజ్‌లో పార్టు టైం లెక్చరర్‌గా పనిచేస్తున్న సాంబశివరావు సర్వీసును క్రమబద్దీకరించాలని ఇది వరకు జస్టిస్ బట్టు దేవానంద్ ధ‌ర్మాస‌నం తీర్పు చెప్పింది. ఆ తీర్పును అధికారులు సకాలంలో అమలు చేయలేదు.

Advertisement
Update:2023-01-19 08:42 IST

కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై ఏపీ హైకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. ఇద్దరు అధికారులకు నెల రోజుల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. జస్టిస్ బట్టు దేవానంద్ ఈ తీర్పు ఇచ్చారు. ఒక దశలో వెంటనే ఆ ఇద్దరు అధికారులనూ అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించాలని కోర్టు వద్ద ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.

పశ్చిమగోదావరి జిల్లా జూనియర్ కాలేజ్‌లో పార్టు టైం లెక్చరర్‌గా పనిచేస్తున్న సాంబశివరావు సర్వీసును క్రమబద్దీకరించాలని ఇది వరకు జస్టిస్ బట్టు దేవానంద్ ధ‌ర్మాస‌నం తీర్పు చెప్పింది. ఆ తీర్పును అధికారులు సకాలంలో అమలు చేయలేదు. దాంతో నాటి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉన్నత విద్యా కమిషనర్ రామకృష్ణలపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీన్ని తాజాగా విచారించిన జ‌స్టిస్ బట్టు దేవానంద్.. ఇద్దరు అధికారులకు నెల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించారు.

అధికారులిద్దరూ ఆ సమయంలో కోర్టుకు క్షమాపణ చెప్పారు. శిక్ష విధించవద్దని కోరారు. న్యాయమూర్తి మాత్రం అందుకు అంగీకరించలేదు. కోర్టు ఆదేశాలంటే లెక్కలేకుండాపోయిందని ఆగ్రహించారు. వెంటనే ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీసులకు అప్పగించాల్సిందిగా ఆదేశించారు. పదేపదే ఇద్దరు అధికారులు విజ్ఞప్తి చేయడంతో.. నెల రోజుల శిక్షను తొలగించి కోర్టు పనివేళలు ముగిసే వరకు కోర్టు హాల్‌లోనే నిలబడాల్సిందిగా ఆదేశించారు.

బట్టు దేవానంద్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ ముందు ప్రభుత్వ న్యాయవాది సవాల్ చేశారు. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్ చక్రవర్తిల ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటికే అధికారులు మధ్యాహ్నం 12.30 నుంచి మూడు గంటల వరకు కోర్టు హాల్‌లో నిలబడాల్సి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News