అప్పుడు రికమండేషన్లకే పని.. ఇప్పుడు అర్హతే పరమావధి
మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి, లీడర్స్ గా తయారు కావాలనే సదుద్దేశంతోటే ఈ పని చేస్తున్నామని చెప్పారు సీఎం జగన్. వారి ద్వారా రాష్ట్రానికి ఏదో ఒకరోజు మంచి జరగాలని, వారి జీవితాలు మిగతా వారికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను విడుదల చేశారు సీఎం జగన్. 390 మంది విద్యార్థుల అకౌంట్లలో రూ. 41.59 కోట్లను జమ చేశారు. వీరిలో సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయిన వారు 95మంది ఉన్నారు. వారిలో కేవలం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి లక్ష రూపాయలు, మెయిన్స్ కి కూడా క్వాలిఫై అయిన 11మందికి లక్షన్నర రూపాయలు ప్రోత్సాహకం అందించారు. గతంలో ఇలాంటి పథకాలకు రికమండేషన్లు కావాల్సి వచ్చేవని, ఇప్పుడు వారి అర్హతే గీటురాయి అని, తమ ప్రభుత్వం పారదర్శకతతో పనిచేస్తోందని వివరించారు జగన్.
"శాచురేషన్, ట్రాన్స్ పరెన్సీ అనే పదాలు మీ అందరి ముందు ఉంచుతున్నా, అర్హత ఉంటే ఎవరికైనా మంచి జరుగుతుంది, ఎక్కడా రికమండేషన్లు పని చేయవు, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు" అని చెప్పారు సీఎం జగన్. . అప్లికేషన్ పెట్టుకుంటే చాలు నేరుగా మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు. గతంలో ఎల్లయ్య, పుల్లయ్య కాలేజీలో చేరినా రికమండేషన్లతో విదేశీ విద్యా దీవెన నిధులు తీసుకునేవారని, కానీ ఇప్పుడు టాప్ 50 కాలేజీల్లో సీటు వస్తే చాలు విద్యా దీవెనకు అర్హత సాధించినట్టేనని వివరించారు. ఫీజు 70 లక్షల రూపాయలున్నా, గత ప్రభుత్వం రూ.10లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందని.. వైసీపీ హయాంలో 1.25 కోట్ల రూపాయల వరకు లిమిట్ పెట్టి సాయం చేస్తున్నామని వివరించారు జగన్.
ఈ సాయం ఎందుకంటే..?
ఇక్కడ చదువుకునే విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తున్నట్టే, విదేశాల్లో చదువుకునేవారికి కూడా మన ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తోందని, మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి, లీడర్స్ గా తయారు కావాలనే సదుద్దేశంతోటే ఈ పని చేస్తున్నామని చెప్పారు సీఎం జగన్. వారి ద్వారా రాష్ట్రానికి ఏదో ఒకరోజు మంచి జరగాలని, వారి జీవితాలు మిగతా వారికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.