మరోసారి గవర్నర్ ని కలుస్తాం.. ఉద్యోగుల ధిక్కార స్వరం

మార్చిలో జరిగే ఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో ఉద్యోగుల జీతాలు సహా ఇతర చెల్లింపులపై చట్టం చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాజాగా డిమాండ్ చేసింది.

Advertisement
Update:2023-02-02 20:24 IST

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. జీతాలు అప్పుడప్పుడూ ఆలస్యం కావడంతోపాటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో ప్రభుత్వం చెల్లించలేకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి చుక్కలు చూపెడుతున్నారు నేతలు. ఇప్పటికే వారు ఓసారి గవర్నర్ ని కలసి నేరుగా ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఆ వ్యవహారంలో ఉద్యోగ సంఘం గుర్తింపుని కూడా రద్దు చేస్తామంటూ ప్రభుత్వం షో కాజ్ నోటీసులివ్వడంతో ఆ నోటీసుల్ని కూడా హైకోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం ఆ వివాదం కోర్టులో నడుస్తోంది. అయితే ఇప్పుడు మరోసారి సమావేశమైన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు.. సమస్యల పరిష్కారానికి మరోసారి గవర్నర్ ని కలిసేందుకు సైతం సిద్ధమేనన్నారు. తగ్గేదే లేదని తీర్మానించారు.

మార్చిలో జరిగే ఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో ఉద్యోగుల జీతాలు సహా ఇతర చెల్లింపులపై చట్టం చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాజాగా డిమాండ్ చేసింది. ఉద్యోగుల బకాయిలు, చెల్లింపులు, చట్టబద్ధత అనే అంశంపై విజయవాడలో చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా 13 తీర్మానాలు ఆమోదించారు. జీతాల చెల్లింపు విషయంలో చట్టం చేయాలనే డిమాండ్‌ పై అన్ని పార్టీలకు వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. పార్టీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను విడివిడిగా కలిసి వినతిపత్రాలు ఇస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలపై చట్టం చేయాలని అడుగుతుంటే, ఇతర సంఘాల నేతలు ఎందుకు కలసి రావడంలేదో అర్థం కాలేదన్నారాయన.

మహారాష్ట్రలో ఉద్యోగుల బదిలీలు, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి చట్టం ఉందని గుర్తు చేశారు సూర్యనారాయణ. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. జీతాల చెల్లింపుల చట్టబద్ధతపై అవసరమైతే మరోసారి గవర్నర్‌ ను కలుస్తామన్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News