ఫర్నిచర్ పాలిటిక్స్.. సోషల్ మీడియా లీక్స్
తాజాగా సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసిందనే సమాచారం కలకలం రేపుతోంది. వ్యూహాత్మకంగా జగన్ పై నిందలు వేయడానికి లేఖల పేరుతో లీకులిస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు.
తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి ప్రభుత్వ ఖర్చుతో ఫర్నిచర్, ఇతర సదుపాయాలు సమకూర్చుకున్నారనే ఆరోపణ కొన్నిరోజులుగా ప్రముఖంగా వినపడుతోంది. జగన్ ని కోడెల శివప్రసాద్ తో పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక ఎల్లో మీడియా కూడా జగన్ పై తనకున్న కక్షనంతా తీర్చుకుంటోంది. ఫర్నిచర్ విషయంలో పూర్తిగా కార్నర్ చేసింది. తాజాగా ఈ విషయంలో జగన్ కు సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసినట్టు ఎల్లో మీడియా కథనాలిచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్, ఎలక్ట్రికల్ వస్తువులను వెంటనే తమకు అప్పగించాలని ఆ లేఖలో జీఏడీ పేర్కొన్నట్టు ఆ కథనం సారాంశం.
ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయిలు ఖర్చు చేసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఫర్నిచర్, ఎలక్ట్రికల్ వస్తువులు ఏర్పాటు చేశారని అంటున్నారు. నిబంధనల ప్రకారం పదవి నుంచి దిగిపోయిన 15 రోజుల్లోగా వాటన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించాలని, ఆ పని ఇంకా జరగకపోవడంతో సాధారణ పరిపాలన శాఖ జగన్ కు లేఖ రాసిందని చెబుతున్నారు.
వైసీపీ వాదన ఏంటి..?
ఫర్నిచర్ విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఇదివరకే వైసీపీ వివరణ ఇచ్చింది. ఫర్నిచర్, తదితర సామానుకి ఖరీదు కట్టి ఆ సొమ్ము ప్రభుత్వానికి చెల్లిస్తామంటూ క్యాంప్ కార్యాలయం తరపున అధికారులకు లేఖ రాశామని వైసీపీ నేతలంటున్నారు. దానికి సంబంధించిన ఫైల్ కూడా పెట్టారని చెబుతున్నారు. ఈలోగా సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసిందనే సమాచారం కలకలం రేపుతోంది. వ్యూహాత్మకంగా జగన్ పై నిందలు వేయడానికి లేఖల పేరుతో లీకులిస్తున్నారని అంటున్నారు. ఫర్నిచర్ వ్యవహారాన్ని ఇంకా వార్తల్లో ఉంచేందుకు, వైసీపీపై నిందలు వేసేందుకే లేఖల ప్రస్తావన చేశారని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు.