పోలవరం, విద్యుత్ బకాయిలే కీలకం.. ఢిల్లీనుంచి జగన్ తిరుగు ప్రయాణం..

పోలవరం, రిసోర్స్‌ గ్యాప్‌ కింద నిధులు, విభజన హామీలు, ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై ప్రధానికి సీఎం జగన్‌ వినతిపత్రం అందించారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు.

Advertisement
Update:2022-08-22 15:39 IST

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. పోలవరం ప్రాజెక్ట్, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలే కీలకంగా ఆయన పర్యటన జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలసి శుభాకాంక్షలు తెలిపారు జగన్. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకి వైసీపీ మద్దతిచ్చింది. అప్పట్లో ఏపీకి రాష్ట్రపతి అభ్యర్థిగా వచ్చిన ఆమెకు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పేరుపేరునా పరిచయం చేశారు జగన్. రాష్ట్రపతిగౌ ద్రౌపది ముర్ము ఎన్నికైన తర్వాత ఆమెను తొలిసారిగా లాంఛనంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.

మోదీతో భేటీ..

ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న జగన్.. సోమవారం ఉదయాన్నే ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఆయన వెంట వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు. పోలవరానికి నిధులు ఆలస్యం లేకుండా విడుదల చేయాలని, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని త్వరితగతిన ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌, ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పోలవరం, రిసోర్స్‌ గ్యాప్‌ కింద నిధులు, విభజన హామీలు, ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై ప్రధానికి సీఎం జగన్‌ వినతిపత్రం అందించారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2900 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కోరారు. సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కూడా విజ్ఞప్తి చేశారు. టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్ట్‌ వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలిపాలని కోరారు జగన్. రిసోర్స్‌ గ్యాప్‌ కింద ఏపీకి రావాల్సిన రూ. 32,625.25 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో మరో 12 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని తన వినతిపత్రంలో కోరారు జగన్.

విద్యుత్ శాఖ మంత్రితో భేటీ..

ప్రధాని భేటీ అనంతరం రాష్ట్రపతిని కలసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్ ఆ తర్వాత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ తో భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ. 6,756వేల కోట్ల విద్యుత్‌ బకాయిలపై చర్చించారు. ఎనిమిదేళ్లుగా ఈ సమస్య పరిష్కారం కాలేదనే విషయాన్ని గుర్తు చేశారు. సుమారు అరగంట పాటు వీరి భేటీ జరిగింది. అనంతరం జగన్ ఢిల్లీనుంచి తిరుగు ప్రయాణం అయ్యారు.

Tags:    
Advertisement

Similar News