ఎస్ సార్, అలాగే సార్.. పవన్ కి ఫుల్ డోస్ ఇచ్చేసిన జగన్

సీఎం జగన్ ప్రసంగంలో దాదాపు నాలుగైదు సార్లు పవన్ ని ప్యాకేజ్ స్టార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్కో ఎన్నికకు పార్టీని ఒక్కో రేటు ప్రకారం అమ్ముకుంటారని ఎద్దేవా చేశారు.

Advertisement
Update:2023-05-16 12:39 IST

ఎస్ సార్, అలాగే సార్.. పవన్ కి ఫుల్ డోస్ ఇచ్చేసిన జగన్

పవన్ కల్యాణ్ కి ఈరోజు ఫుల్ డోస్ ఇచ్చేశారు సీఎం జగన్. మత్స్యకార భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబు కంటే ఎక్కువగా పవన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. పదే పదే ప్యాకేజీ స్టార్ అంటూ చెణుకులు విసిరారు. దత్త తండ్రి, దత్త పుత్రుడంటూ.. చంద్రబాబు, పవన్ ని కలిపి ఆటాడేసుకున్నారు. పదేళ్ల క్రితం పార్టీ పెట్టిన పవన్, కనీసం 175 స్థానాల్లో అభ్యర్థుల్ని కూడా నిలబెట్టలేకపోతున్నారని, రెండు చోట్ల పోటీ చేసి, రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఇంకేం రాజకీయాలు చేస్తారని ఎద్దేవా చేశారు. ప్రజలే పవన్ ని ఎమ్మెల్యేగా వద్దు అంటూ ఓడించారని అన్నారు జగన్.

ప్యాకేజ్ స్టార్..

సీఎం జగన్ ప్రసంగంలో దాదాపు నాలుగైదు సార్లు పవన్ ని ప్యాకేజ్ స్టార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్కో ఎన్నికకు పార్టీని ఒక్కో రేటు ప్రకారం అమ్ముకుంటారని ఎద్దేవా చేశారు. పార్టీని హోల్ సేల్ గా అమ్ముకునే ప్యాకేజీ స్టార్.. చివరకు ముఖ్యమంత్రి కూడా కావాలనుకోవట్లేదని, కేవలం దోపిడీలో వాటా వస్తే చాలనుకుంటున్నారని చెప్పారు. సినిమా షూటింగ్ కి షూటింగ్ కి మధ్య గ్యాప్ లోనే పవన్ ఏపీకి వస్తారని, చంద్రబాబుకి ఇచ్చిన కాల్షీట్ల ప్రకారం తనపై విమర్శలు చేసి వెళ్తుంటారని అన్నారు.

ఎస్ సార్, అలాగే సార్..

చంద్రబాబు ఏం చెబితే దానికి ఎస్ సార్, అలాగే సార్ అంటూ పవన్ తల ఊపుతారని.. కలసి పోటీ చేస్తాం పవన్ అని చంద్రబాబు ఆఫర్ ఇస్తే ఎస్ సార్ అంటారని, విడివిడిగా పోటీ చేస్తేనే టీడీపీకి లాభం అంటే.. అలాగే సార్ అని బదులిస్తారని చెప్పారు జగన్. కమ్యూనిస్ట్ లతో కలువు అంటే కలిసిపోతారని, బీజేపీకి విడాకులివ్వు అనగానే ఇచ్చేస్తారని.. ఇదే పవన్ రాజకీయం అని మండిపడ్డారు జగన్. గాజువాక, మంగళగిరిలో పవన్ ని చంద్రబాబు ఇబ్బంది పెట్టలేదని, ఫలితంగా మంగళగిరిలో జనసేన పోటీ చేయలేదని.. ఇదంతా వారి లోపాయికారీ ఒప్పందాలేనని అన్నారు జగన్.

చంద్రబాబు, ప‌వ‌న్‌కు రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేవన్నారు జగన్. వారంతా ఎందుకు కలుస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. రాష్ట్రాన్ని గజదొందల ముఠా దోచుకోవాలనుకుంటోందని, దోచుకున్నది పంచుకోవాలనుకుంటోందని చెప్పారు. తనపై వ్యవస్థలని ప్రయోగించినా, కత్తి కట్టినా 15ఏళ్లుగా ఎక్కడా తాను బెదరలేదని, ప్రజల తరపునే నిలబడ్డానని, కాంప్రమైజ్ కాలేదని వివరించారు జగన్.

తనను ప్యాకేజ్ స్టార్ అంటే ఊరుకోనంటూ గతంలో పవన్ బహిరంగ సభలో హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ నేతలు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. పైగా సీఎం జగన్ స్వయంగా పవన్ ని ఈ రోజు ఓ రేంజ్ లో ఆటాడేసుకున్నారు. పదే పదే ప్యాకేజ్ స్టార్ అంటూ రెచ్చగొట్టారు. మరి దీనికి జనసేన నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News