వైనాట్ 175.. మా సంగతేంటంటున్న బీజేపీ
175 స్థానాల్లో పోటీ గొప్ప విషయమేమీ కాదు, ఆ మాటకొస్తే కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పోటీకి దింపుతారు. ఆ మాత్రానికి బీజేపీ ఎందుకు ఉడుక్కుంటుందో అర్థం కావడంలేదు.;
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడో హాట్ డిస్కషన్ మొదలైంది. ఇన్నాళ్లూ 175 సీట్లు మావేనంటున్న వైసీపీ ఇప్పుడు కొత్త రకం ర్యాగింగ్ మొదలు పెట్టింది. దమ్ముంటే 175 స్థానాల్లో టీడీపీ, జనసేన పోటీ చేయగలవా అంటూ ప్రశ్నిస్తున్నారు నేతలు. కనీసం ఏపీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయగలం అని చెప్పుకోలేని దీన స్థితిలో టీడీపీ, జనసేన ఉన్నాయంటూ ఎగతాళి చేస్తున్నారు. జగన్ తర్వాత మంత్రులు, మాజీ మంత్రులంతా ప్రెస్ మీట్లు పెట్టి దమ్ముంటే 175 అంటూ రెచ్చగొడుతున్నారు. దీనిపై టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ సరైన స్పందన లేదు. 175 స్థానాల్లో మేము పోటీ చేస్తామని కానీ, లేదా సీట్లు పంచుకుంటామని కానీ, కలసి పోటీ చేస్తామని కానీ చెప్పలేకపోతున్నారు నేతలు. ఈ దశలో ఏపీ రాజకీయాల్లో ఆటలో అరటిపండులా మారిన బీజేపీ మాత్రం ఉడుక్కుంటోంది. జగన్ సహా ఇతర నేతలెవరూ బీజేపీ పేరు ప్రస్తావించడం లేదని చిన్నతనంగా భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. తాము కూడా రాజకీయాల్లోనే ఉన్నామంటూ హింట్లిస్తున్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్దన్ వంటి నేతలు. జనసేనతో కలసి బీజేపీ 175 స్థానాల్లో పోటీ చేసి తీరుతుందని ఆయన సవాల్ విసురుతున్నారు.
175 స్థానాల్లో పోటీ గొప్ప విషయమేమీ కాదు, ఆ మాటకొస్తే కేఏపాల్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పోటీకి దింపుతారు. ఆ మాత్రానికి బీజేపీ ఎందుకు ఉడుక్కుంటుందో అర్థం కావడంలేదు. కనీసం ఏపీ రాజకీయాల్లో బీజేపీ అనే పార్టీ ఒకటి ఉందని, ఆ పార్టీకి నాయకులు ఉన్నారని అధికార వైసీపీ గుర్తించకపోవడంతో వారికి బాధ మొదలైంది. దీంతో విష్ణువర్దన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ పోటీ వివరాలు తెలియజేశారు.
ఏపీలో వైసీపీని ఎదుర్కొనే బలం టీడీపీకి లేదని అసలైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని అంటున్నారాయన. జనసేన అసలు బీజేపీని లెక్కలో వేసుకోకపోయినా, ఆ పార్టీ మాత్రం పవన్ కల్యాణ్ ఇంకా తమవాడేననే భ్రమలో ఉంది. అందుకే బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తాయి అంటున్నారు కమలం పార్టీ నేతలు. తాము అధికారంలోకి వస్తే రాయలసీమ డిక్లరేషన్ అమలు చేసి తీరతామంటున్నారు. రాబోయే రోజుల్లో ఏపీ బీజేపీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. మొత్తమ్మీద 175 నియోజకవర్గాల్లో పోటీ అనే అంశంలో బీజేపీని ఎవరూ లెక్కలోకి తీసుకోకపోవడం విశేషం.