అమరావతి దెయ్యాల రాజధాని.. మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి అనేదే ఒక నినాదం కాదు వివాదం అని అన్నారు మంత్రి అమర్నాథ్. అక్కడ పేదవాళ్ల‌ను చంపి పెద్దలకు మేలు చేశారని, అమరావతి కోసం గుంటూరు, విజయవాడకు చంద్రబాబు అన్యాయం చేశారని ఆరోపించారు.

Advertisement
Update:2022-09-09 15:57 IST

రాజధానికోసం అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిన సమయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదని, అది దెయ్యాల రాజధాని అని మండిపడ్డారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని, త్వరలోనే కొత్త బిల్లుతో వస్తామని చెప్పారాయన. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

అమరావతి అనేది ఒక నినాదం కాదు వివాదం అని అన్నారు అమర్నాథ్. అక్కడ పేదవాళ్ల‌ను చంపి పెద్దలకు మేలు చేశారని, అమరావతి కోసం గుంటూరు, విజయవాడకు చంద్రబాబు అన్యాయం చేశారని ఆరోపించారు. డస్ట్ బిన్ లీడర్లను చంద్రబాబు ప్రస్తుతం తన పక్కనపెట్టుకున్నారని అన్నారు.

ఆ మాట వింటే కులీ కుతుబ్ షా ఉరేసుకుంటారు..

హైదరాబాద్ రూపశిల్పిని, హైదరాబాద్ అభివృద్ధి ప్రదాతను అంటూ చంద్రబాబు చెప్పుకుంటున్నారని, ఒకవేళ కులీ కుతుబ్ షా బతికి ఉండి, ఆ మాటలు వింటే కచ్చితంగా ఉరేసుకునేవారని సెటైర్లు వేశారు అమర్నాథ్. గాడిదకు కొమ్ములు వచ్చినా, ముసలోడికి పిచ్చివచ్చినా భరించడం కష్టమని, ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అలాగే ఉందని అన్నారు. ఆయన మాటలు వింటుంటే.. పిచ్చి బాగా ముదిరినట్టు స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో టీడీపీ ఎక్కడ..?

హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకునే చంద్రబాబు, తెలంగాణలో పార్టీని ఎందుకు మూసేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్. కేవలం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్, దాని ముందు ఉన్న వాచ్‌మ‌న్‌.. అవే టీడీపీకి మిగిలాయని అన్నారు. ఏపీలో కూడా టీడీపీకి తెలంగాణలో పట్టిన గతే పడుతుందని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News